IPS Ajay Pal Sharma : పశ్చిమ బెంగాల్ రాజకీయ క్షేత్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. రాష్ట్రంలో ప్రశాంతమైన, నిష్పక్షపాతమైన పోలింగ్‌ జరిగేలా భారత్ ఎన్నికల సంఘం అత్యంత వ్యూహాత్మకమైన అడుగులు వేస్తోంది.    ఇందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన కఠినమైన అధికారిగా, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ఐపీఎస్ అజయ్ పాల్ శర్మను ఎన్నికల పరిశీలకుడిగా రంగంలోకి దించింది. 

అజయ్‌పాల్ శర్మ ఎవరు?

అజయ్‌పాల్ శర్మ 2011 బ్యాచ్‌కు చెందిన ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి. లుథియానాకు చెందిన ఆయన తన విధి నిర్వహణలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని పేరు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అనేక హై రిస్క్ ఆపరేషన్‌లలో పాల్గొన్న ఆయనకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ అనే ముద్ర ఉంది. నేరగాళ్ల గుండెల్లో నిద్రపోయేలా చేసే ఆయన పనితీరును దృష్టిలో ఉంచుకొని బెంగాల్‌లోని సున్నితమైన ప్రాంతాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యతను ఎన్నికల సంఘం ఆయనకు అప్పగించింది. 

ఎందుకు సౌత్ పరగణాల జిల్లాకు అజయ్‌పాల్‌ను పంపిస్తున్నారు?

అజయ్‌పాల్ శర్మను ప్రత్యేకంగా సౌత్‌ 24 పరగణాల జిల్లాకు పోలీస్ అబ్జర్వర్‌గా నియమించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ సెకండ్ ఇన్‌ కమాండ్‌ అభిషేక్ బెనర్జీకి తిరుగులేని కంచుకోటగా చెబుతారు. ఇక్కడ ఎన్నికల సమయంలో గొడవలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఒక సమర్థుడైన పోలీస్ అధికారి పర్యవేక్షణ అవసరమని ఎన్నికల సంఘం భావించింది. 

బుధవారం పోలింగ్ 

ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ విడతలో కోల్‌కతాతో సహా దక్షిణ బెంగాల్‌లోని ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న 142 నియోజకవర్గాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు.  మొత్తం 3,21, 73, 837 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీని కోసం 41, 001 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

కీలక స్థానాల్లో టఫ్ ఆఫీసర్లు

ఎన్నికలను హింసారహితంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను ఏర్పాటు చేసింది. ఏడు జిల్లాల్లో మొత్తం 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.కేవలం కోల్‌కతా నగరంలోనే అత్యధికంగా 273 కంపెనీల బలగాలు పహారా కాయనున్నాయి. అజయ్‌పాల్‌ శర్మ వంటి 95 మంది పోలీస్ అబ్జర్వర్లతోపాటు 142 మంది జనరల్ అబ్జర్వర్లు, 100 మంది వ్యయ పరిశీలకులు నిరంతరం నిఘా ఉంచుతారు.  ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రియల్ టైమ్ మానిటరింగ్ కోసం కెమెరాలు అమర్చిన డ్రోన్లను కూడా వాడుతున్నారు. 

Also Read: జేబులో ఉల్లిపాయ ఉంటే ఏసీ అక్కర్లేదన్న కేంద్రమంత్రి సింధియా - ఓర్నీ ఈ చిట్కా లక్షలు ఖర్చు పెట్టేసుకుంటున్నారే!

హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు 

సాధారణంగా ఎన్నికల సమయంలో స్థానిక పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయనే ఆరోపణలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులను పోలీస్ అబ్జర్వర్లుగా నియమించడం వల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది. అజయ్ పాల్ శర్మ వంటి అధికారులు నేరుగా ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేస్తారు.  పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడత పోలింగ్ టైంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అందుకే ఈసారి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంది ఈసీ. టఫ్ ఆఫీసర్లను నియమించి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా భరోసా కల్పించాలని భావిస్తోంది.  

Also Read: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్