Telangana MLC Graduate Elections: ఉమ్మడి వరంగల్ - నల్గొండ - ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC Elections) ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. క్యూలైన్లలో ఉన్న వారు ఓటు వేసేందుకు అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ 49.53 శాతం పోలింగ్ నమోదు కాగా.. 4 గంటల వరకూ దాదాపు 60 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 605 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ సాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా.. ఉప ఎన్నిక అనివార్యమైంది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఏనుగల రాకేష్‌రెడ్డి పోటీలో నిలిచారు. వీళ్లతో పాటు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల విధానాలను వ్యతిరేకించే వాళ్లంతా కూడా స్వతంత్రంగా బరిలో నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉన్నారు.
ఓటేసిన ప్రముఖులు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ఆయన భార్య మమత ఓటేశారు. అటు, హనుమకొండలోని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మఠంపల్లి మండల కేంద్రంలో హైస్కూల్‌లో నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, వరంగల్ కాశీబుగ్గలోని వివేకానంద కళాశాలలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్, నల్గొండ డైట్ స్కూల్లో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హనుమకొండ తేజస్వీ పాఠశాలలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ జిల్లా కేంద్రంలోని ప్రిస్టన్ కళాశాలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జూన్ 5న కౌంటింగ్
ప్రాధాన్యత ఓటు పద్ధతి అయినందున బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ సాగింది. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అధికారులు ఇచ్చిన పైలెట్ రంగు పెన్నుతో ప్రాధాన్యత టిక్ చేశారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలికి సిరా చుక్క పెట్టినందున ఈసారి ఎడమ చేయి మధ్య వేలికి సిరా చుక్క వేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. మద్యం దుకాణాలు మూసేసి 144 సెక్షన్ విధించారు. సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసినప్పటికీ ఇంకా క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపడతారు.