Telangana Panchayat Elections : తెలంగాణలో ఉత్కంఠ రేపిన పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. 56 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎక్కడెక్కడి వారంతా ఓట్ల కోసం గ్రామాల బాట పట్టారు. మొదటి విడత ఎన్నికల కోసం నాలుగువేలకుపైగా పంచాయతీలకు నోటిఫికేషన్ వచ్చినప్పటికీ అందుకే 396 ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగతా మూడువేలకుపైగా పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలను బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిన్ వెల్లించారు.
పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 7గంటలకు ప్రారంభమైంద. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రమే ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కానుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇదే రోజు పూర్తి చేస్తారు. మొత్తం 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందరూ స్వేచ్ఛగా ఓట్లు వేయాలని అధికారులు సూచించారు. మొదటి విడతలో 396 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 2489 మంది మొత్తం 3 దశల్లో జరిగే ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్స్‌గా నియమించారు. 3461 వెబ్ కాస్టింగ్ సిబ్బందిని పోలింగ్ కోసం నియమించారు. ఓటర్ స్లిప్స్ ముందు రోజే పంపిణీ చేశారు.
12 రకాల గుర్తింపు కార్డులతో ఏదైనా ఒక కార్డుతో వెళ్లి ఓటు వేయొచ్చని రాణి కుముదిన్ చెప్పారు. తొలి దశ పోలింగ్ కోసం మొత్తం 45వేల 86 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్స్ ఇచ్చారు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే చెప్పాలని సూచించారు. దానికి ఇప్పటివరకు 1200 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఓటింగ్ ఏరియాలో హాలిడే ప్రకటించారు.
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన భద్రతపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరం మినహా రాష్ట్రవ్యాప్తంగా 3,800కుపైగా గ్రామ పంచాయతీలలోని సుమారు 37,000 వార్డులకు పోలింగ్ నిర్వహించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు 3,000కుపైగా గ్రామ పంచాయతీలలో వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష నిఘా ఏర్పాటు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన బందోబస్తు చర్యలు చేపట్టామని డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు సివిల్ పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వ్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బలగాలతో పాటు, ఇతర ప్రభుత్వ శాఖలలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని సైతం విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. సెన్సిటివీటి ఆధారంగా అన్ని పోలింగ్ కేంద్రాలను 'క్లిష్టమైన', 'సాధారణ' కేంద్రాలుగా వర్గీకరించి, ఆయా ప్రాంతాల భద్రతకు అనుగుణంగా పోలీసు బలగాలను మోహరించారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనున్న వేళ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పూర్తి భద్రత ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
ఎన్నికల నిబంధనల అమల్లో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఇప్పటివరకు 8.20 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు డిజిపి వెల్లడించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై మొత్తం 229 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా 1,053 నాన్-బెయిలబుల్ వారెంట్లను అమలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల భద్రతా నిబంధనల పరిధిలోకి వచ్చే వ్యక్తుల లైసెన్స్ పొందిన అన్ని ఆయుధాలను డిపాజిట్ చేయించినట్లు ఆయన వివరించారు.
అక్రమ రవాణాను నియంత్రించేందుకు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతో ఉన్న రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 54 అంతర్-రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. అలాగే, ఎన్నికల మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 537 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 155 స్టాటిక్ నిఘా బృందాలు రుకుగా పనిచేస్తున్నాయని డిజిపి తన ప్రకటనలో వివరించారు.