Telangana Panchayat Elections 2025: తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. తొలి దశలో 3836 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవంగా 4236 పంచాయతీల్లో ఎన్నికలకు తొలి దశలో నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇందులో దాదాపు నాలుగు వందల గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎన్నికలను బహిష్కరించడంతోపాటు వివిధ కారణాలతో నామినేషన్‌లు దాఖలు కాలేదు. అక్కడ ఎన్నికలు జరగడం లేదు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పదమూడు వేల మందికిపైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. వారి భవిష్యత్‌ను 56 లక్షల మందికిపైగా ఓటర్లు తేల్చనున్నారు.
తొలి దశ పంచాయతీ పోలింగ్ వివరాలు
తొలి దశలో నోటిఫికేషన్ వచ్చిన గ్రామపంచాయతీలు- 4236తొలి దశలో నోటిఫికేషన్ వచ్చిన వార్డులు-37,440తొలి దశలో ఏకగ్రీవమైన పంచాయతీలు- 400పోలింగ్ జరుగుతున్న పంచాయతీలు- 3836పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు-37,562పోలింగ్‌లో పాల్గొనే ఓటర్లు - 56,19,430పోలింగ్ జరిగే పంచాయతీల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు- 12,960
పక్కా ఏర్పాట్లు
ఓటు హక్కు కలిగి ఉన్న వారంతా పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పిలుపునిచ్చారు. అందరూ స్వేచ్ఛగా ఓట్లు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించారు. సెన్సిటివిటీ ఉన్న గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని అవసరమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించినట్టు వెల్లడించారు. లక్షల మంది సిబ్బంది విధుల్లో ఉంటున్నారని ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీ టీవీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అన్ని ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అన్నారు.
18 పత్రాల్లో ఏదైనా చూపించవచ్చు
తొలి దశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇన్ని రోజులు ప్రతి గడప తిరిగిన అభ్యర్థులు ప్రచారం మంగళవారంతో ముగిసింది. మంగళవారం నుంచి ఆయా గ్రామాల్లో ఉండే వైన్‌షాపులు బంద్ అయ్యాయి. ఎలాంటి భయం లేకుండా ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఎదైనా సమస్య ఉండే స్థానికంగా ఉండే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వం సూచిన 18 కార్డుల్లో ఏదైనా కార్డు చూపించి ఓటు వేయవచ్చని చెప్పారు.
భారీగా నగదు పట్టివేత
షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి భారీ సంఖ్యలో నగదు పట్టుకున్నట్టు రాణి కుముదిని ప్రకటించారు. మొత్తంగా 3,214 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు అయినట్టు తెలిపారు. 902 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 1,70,58,340 రూపాయల నగదు సీజ్ చేశారు. 2,22,91,714 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 12,15,500 విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు అధికారులు సీజ్ చేసిన సొత్తు విలువ 7,54,78,535 రూపాయులుగా తేల్చారు.
మొత్తం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుపుతోంది ఎన్నికల కమిషన్. మొదటి దశ గురువారం జరగనుంది. రెండో ద డిసెంబర్ 14న జరగనుంది. మూడో దశ అక్కడికి మూడు రోజుల తర్వాత డిసెంబ్ 17న జరుపుతారు. సర్పంచ్ వార్డు మెంబర్స్‌కు ఎన్నికలు జరిగిన రోజునే లెక్కింపు కూడా చేపడతారు. అదే రోజు సర్పంచ్, ఉపసర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి చేస్తారు.