Top 10 Reasons For YSRCP Loss | 2019 ఎన్నికల్లో 151 సీట్లు.. చరిత్రలో మరెవ్వరూ సాధించరేమో అన్నంత రీతిలో విజయాన్ని సాధించిన జగన్ మోహన్ రెడ్డి.. మరోసారి చరిత్ర సృష్టించారు. చరిత్రలో మరెవ్వరూ ఇంతలా ఓటమి చెందరేమో అన్న రీతిలో ఘోర పరాజయం పొందారు. 151 సీట్లు అంటే అది ఆయన విజయం మాత్రమే కాదు.. ఆయనపై జనం పెట్టుకున్న నమ్మకం. మరి నమ్మకం ఏమైంది.. విశ్వాసం ఎందుకు పోయింది. జగన్ కూడా అదే ప్రశ్నించారు. నేను చాలా చేశాను కదా.. నన్ను ఎందుకు నమ్మడం లేదు అని కౌంటింగ్ డే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధపడిపోయారు.


జగన్ మోహన్ రెడ్డి బాధ ఏంటంటే... ఇంత చేసినా నన్ను ఓడించారే.. ఇంత మంచి చేశాను నన్ను మోసం చేశారే అన్నట్లు ఉంది జగన్ బాధ. ఇక జగన్ ఓటమికి ఓ కారణం అయిన ఆయన సోషల్ మీడియా అనుచరులైతే.. జనాన్ని మోసం చేసిన నాయకులున్నారు.. కానీ.. జనం చేతిలో మోసపోయిన నాయకుడు జగన్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటివే జగన్‌కు మచ్చ తీసుకొచ్చాయి. వీటి గురించి మాట్లాడే ముందు అసలు జగన్ కోట ఎందుకు బద్దలైంది. దానికి ఎవరు కారణం అనేది చూస్తే.. దానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ఆయనే కారణం.. ఇంకెవరో కాదు. అందుకు ఓ పది కారణాలు ఇక్కడ తెలుసుకుందాం. 


1. ఎక్కడ చూసినా భయం
అవును జగన్ పాలనలో ఎక్కవ రోజులు జనాలు భయంతో బ్రతికారు. ఈ భయం చాలా రకాలుగా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరేం చేస్తారో అన్న భయం, సీఐడీ పట్టుకుపోతుందేమో అన్న భయం. పోలీసు స్టేషన్ లో వేసి కొడతారేమో అని ప్రజా ప్రతినిధులకు భయం. మంత్రులు, నేతలు నోటికొచ్చినట్లు తిడతారేమో అని కొంత గౌరవం ఉన్న ప్రతిపక్ష నేతలకు భయం. వ్యతిరేక వార్తలు రాస్తే ఏం జరుగుతుందో అని మీడియాకు భయం. వాళ్లను తట్టుకోలేమో అన్న భయం. వీళ్ల భయాలు ఇలా ఉంటే.. సామాన్య జనాల భయాలు వేరు. వాళ్లకు రేపు ఏమవుతుందో అన్న భయం. తమ పిల్లలకు ఉద్యోగాలు ఉండవేమో అన్న భయం. అంతెందుకు రోడ్డు మీదకు వెళితే.. గోతుల రోడ్డులో దెబ్బలు తగిలించుకోకుండా తిన్నగా రాలేమోమన్న భయం. ఇది మేం మాత్రమే చెప్పడం లేదు. చాలా మంది మాట్లాడుకున్నదే. 


2. మాట తప్పడం- మడుమ తిప్పడం 
జగన్ మోహనరెడ్డి ట్రేడ్ మార్క్ ఏంటి.. ? మాట తప్పడు.. మడమ తిప్పడు అని.. అది నిజమా అంటే కాదు. ప్రత్యేక హోదాపై మాట తప్పారు... మధ్య నిషేధం విషయంలో మాట తప్పారు. సీపీఎస్ పై మాట తప్పారు. ఇవన్నీ కష్టం అని చెప్పొచ్చు. కానీ ఎన్నో కష్టమైన విషయాలను చేసుకొచ్చిన జగన్‌మోహనరెడ్డికి మద్య నిషేధం విధించడం సాధ్యం కాదా.. నిజంగా అది సాధ్యం కాని పనా కాదు.. అది చేస్తే.. ఆయన ప్రభుత్వమే ఆగిపోతుంది. ప్రభుత్వాన్ని నడిపించే ఇంధనమే.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం. ఇది మహిళలను మోసం చేయడం కాదా.. ఈ తప్పు చేసి నేను అక్కచెల్లమ్మలకు డబ్బులు వేశాను అంటే చెల్లుతుందా.. చెల్లెమ్మ ఓటేస్తుందా... నాసిరకం బ్రాండ్లను అమ్మి జనాల పేదల దగ్గర దోచేసి.. నేను పేదలకు మంచి చేశాను అంటే వాళ్లకు తెలియదా..  మద్యనిషేధం, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పామని స్వయంగా ఆయన కోసం రెండు సార్లు మంత్రి పదవి వదులుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వయంగా చెప్పారు. 


౩. అమరావతి అంతం 
అవును అమరావతి అంతమే నా పంతం అన్నట్లుగా సాగింది జగన్మోహనరెడ్డి ధోరణి. అమరావతిపై వేరే అభిప్రాయం ఉండటం తప్పు కాదు. కానీ ఎన్నికలకు ముందు ఓ మాటా.... ఎన్నికలకు తరువాత ఓ మాటా చెప్పడం తప్పు. ఎన్నికల ప్రచారంలో కూడా అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నా.. ఇంత కంటే బాగా రాజధాని చేస్తా అని చెప్పడమే కాకుండా అమరావతి అభివృద్ధిపై వైసీపీ బ్లూ ప్రింట్‌ను సాక్షి పేపర్లో రెండు పేజీలు పరచడం నిజం కాదా.. నిజంగా అమరావతి నచ్చకపోతే.. అది తప్పు అనుకుంటే అమరావతి కోసం మీరు బ్లూ ప్రింట్ ఎందుకు వేశారు. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ మాట ఎందుకు మారింది.. ఇవన్నీ జనాలు చూడరా.. జగన్ ఏస్థాయిలో ప్రవర్తించారంటే.. నాలుగేళ్లు ఆందోళన చేసిన అమరావతి రైతులను కనీసం పిలిపించి మాట్లాడలేదు. ఆ దారిలో సెక్రటేరియెట్ కు వెళుతూ కనీసం కారు ఆపి వాళ్లని పలకరించి.. మీ బాధ ఏంటని ప్రశ్నించలేదు. 


4. మూడు రాజధానులంటూ మోసం
కేవలం అమరావతిని ఆపడానికి మూడు రాజధానులు తెచ్చారని రాష్ట్రంలో దాదాపు ప్రతి ఒక్కరికీ అర్థం అయింది. మూడు రాజధానుల విషయంలో జగన్ మోహనరెడ్డికి చిత్తశుద్ధి లేదని మిగతా వాళ్లకీ అర్థం అయింది. నిజంగా మూడు రాజధానులు అవసరం, అది అభివృద్ధి కోసమే అనుకుంటే  7వేల కోట్లు ఖర్చు పెట్టి, భూమి సిద్ధంగా ఉండి.. భవనాలు చాలా వరకూ నిర్మించిన అమరావతిని పరిపాలనా రాజధానిగా చేసి మిగిలిన వాటిని ఆయన అనుకున్నట్లు చేయొచ్చు. లేదా రాజధానితో అభివృద్ధి జరుగుతుందనుకుంటే రాయలసీమలో పరిపాలనా రాజధాని పెట్టొచ్చు. వైజాగ్ లో రాజధాని అన్నప్పుడే అందులో ఉన్న తేడా ఏంటో తెలిసింది. చివరకి ఆ వైజాగ్ వాళ్లు కూడా దాన్ని ఆహ్వానించలేదు. 



5. విధ్వంసం 
ఎవరైనా పరిపాలన నిర్మాణాత్మకంగా ప్రారంభిస్తారు. కానీ జగన్ మోహనరెడ్డి ఫస్ట్ మేజర్ డెసిషన్ ప్రజా వేదికను కూల్చేయడం. 6 కోట్ల ప్రాపర్టీని ఆరుగంటల్లో కూల్చేశారు. కనీసం అది ప్రజల సొమ్ము అని కూడా ఆలోచించలేదు. నిజంగా అక్రమ కట్టడం అయితే.. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో నదీ తీర ప్రాంతాల్లోని అన్ని కట్టడాలను తొలగించాలి. కనీసం అందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి. అలాంటి ప్రయత్నం  ఏం లేదు. ముందుగా ప్రజా వేదిక విధ్వంసంతో మొదలైన పాలన ఆ తర్వాత వ్యవస్థల విధ్వంసం వరకూ వెళ్లింది. సీఐడీ సొంత సైన్యంలా వాడేశారు. అడ్మినిస్ట్రేషన్ కు అర్థం మార్చేశారు. 


6. విద్వేషం 
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారికి వివేచన, వివేకం రెండూ ఉండాలి. అందరూ మనుషులే రాగద్వేషాలు లేకుండా పోవు. కానీ ఆ విషయంపై అదుపు ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ఫలానా కులం నచ్చదు అనే భావన కలిగేలా ఆయన తీసుకున్న చర్యలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ కులం వాళ్లకు లబ్ది జరిగింది అని ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. అలా అంతకు ముందు ఏ రాష్ట్ర స్థాయి నేతా ఓ కులం గురించి మాట్లాడలేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. కరోనా వాక్సిన్ల విషయంలో కూడా ఆ కులం గురించి మాట్లాడారు. వాటిలో నిజానిజాలు ఏమున్నా రాష్ట్రానికి పెద్దగా ఉన్న ఓ వ్యక్తి నుంచి అలాంటి మాటలు రాకూడదు. జగన్ రెడ్డి ఆ మెచ్యూరిటీని ప్రదర్శించలేకపోయారు. ఆయన చేసిన పని.. ఆ కులం కాని వాళ్లు కూడా హర్షించలేకపోయారు. కచ్చితంగా వాళ్లని టార్గెట్ చేశారు అని గుర్తించగలిగారు. వైసీపీ ప్రభుత్వానికి ఆ ఉద్దేశ్యం ఉన్నా లేకపోయినా ఆ భావన జనంలో వచ్చిందంటే ఆ భావన రాకుండా పరిపాలించలేకపోయారనే అనుకోవాలి. ఈ రాష్ట్రంలో కమ్మకులం అన్నదే ఉండకూడదు అని కిందటి ప్రభుత్వం అనకుంటోంది అని తెలుగుదేశం నేతలు బహిరంగంగానే మాట్లాడారు.


7. స్వపరిపాలన 
ఇదేదో తెలంగాణవాళ్లలాగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో సొంత పరిపాలన చేసుకోవడం లాంటిది కాదు. స్వపరిపాలన అంటే.. సొంత వాళ్లు పాలన. అందులో కూడా వాళ్లకి పూర్తి అధికారాలుండవ్ కానీ.. పదవుల్లో మాత్రం తమ వాళ్లు ఉంటారు.ప్రతి పక్షంలో కుల పక్షపాతం గురించి అంత మాట్లాడిన జగన్ మోహనరెడ్డి ప్రభుత్వంలో అందరూ సొంత కులం వాళ్లే.. రాజకీయంగా అన్ని మూడు ప్రాంతాలూ సామంతుల్లా ఏలిన విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి. అసలు విశాఖలో నెల్లూరు , ప్రకాశం రెడ్లకు పనేంటి అన్న వాళ్లు లేరు. వీళ్లందరూ ఒకటైతే.. జగన్ కు కళ్లూ ముక్కూ చెవులు అయిన మరో రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీలోని అందరూ నేతలు మొదటి ముగ్గరు రెడ్డు చెప్పినట్లు వినాలి. ప్రభుత్వంలోని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సజ్జల రామకృష్టారెడ్డి చెప్పినట్లు చేయాలి. ఇక చెవిరెడ్డి, మిథన్‌రెడ్డి, అనిల్ రెడ్డి లాంటి వాళ్లతో ఆంతరంగిక కోటరీ ఉంది.  కార్పోరేషన్లు, విశ్వవిద్యాలయాలు, నామినేటెడ్ పోస్టులు అన్నీ రెడ్లతో నిండిపోయాయి. ప్రతిపక్షం వాళ్లైతే.. కొన్ని వందల మంది రెడ్ల పేర్లకు పదవుల పంపకం ఎలా ఉందో జాబితాలు పెట్టేవారు. అవతలి వాళ్లని కులం గురించి మాట్లాడే జగన్ రెడ్డి... ఇలాంటి విషయాలు చూసుకోరా.. 


8. పంచేస్తే పెంచేస్తారా.. 
నేను డబ్బులు పంచేశాను... అవే ఓటర్లను పెంచేస్తాయన్నది జగన్ నమ్మకం. ఇది కచ్చితంగా జనాల స్థాయిని తగ్గించడం. వాళ్లని బానిస మనస్తత్వంతో చూడడం. పేదల స్థితిగతులు పెంచడానికే చాలా పథకాలు తెచ్చానని మంచి పనులు చేశానని ఆయన చెప్పుకున్నారు. అందులో కొంత నిజం లేకపోలేదు. కానీ పంచేస్తే మాత్రమే ఓట్లు వేయరు. పనిచేస్తే చేస్తారు.  ఆ పని కేవలం బటన్లు నొక్కడం మాత్రమే కాదు. రాష్ట్రానికి ఏదైనా ప్రాజెక్టులు తేవడం. జనాలకు ఉపాధి కల్పించడం.. రోడ్లు వేయించడం.. ఇలాంటివి చేయాలి. అప్పులు తెచ్చి బటన్లు నొక్కుతాను అంటే.. వాళ్లూ నొక్కుతారు బటన్.. ఎలక్షన్లో ఈవీఎం బటన్..!


9. పరదాల ప్రైవేట్ లిమిటెడ్ 
ప్రభుత్వం అంటే పబ్లిక్. జగన్ మోహన్ రెడ్డి తాము చేసేదంతా పబ్లిక్ కోసమే అంటారు. కానీ పబ్లిక్ ను కలవరు. కలవడం కాదు.. పబ్లిక్ గా తిరగరు. ఏవైనా బహిరంగసభలు జరిగినప్పుడు తప్ప.. జగన్ జనంలోకి రారు. జననేత అంటారు కానీ ఆయన జనంలోకే రారు. ఆకాశంలో వెళుతుంటే నేల మీద చెట్లు కొట్టేస్తారు. కారులో వెళుతుంటే రోడ్లుపైన పరదాలు కట్టేస్తారు. పోనీ మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు కలుస్తారా వాళ్లకి డోర్ క్లోజ్ చేసి.. పరదా పెట్టేస్తారు. ఇటు ప్రజలను కలవక.. అటు ప్రజా ప్రతినిధులను కలవక.. ఆయన పబ్లిక్ కనెక్షన్ ఎక్కడుంది.. 


10. హద్దులు దాటిన విమర్శలు 
రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. ఎవరైనా మాట్లాడితే.. ఓ బూతుల బృందం దాడులు మొదలు పెడుతుంది. అది ఎలా అంటే మంత్రుల స్థాయి నుంచి కింద సోషల్ మీడియా కార్యకర్తల వరకూ ఓ వ్యవస్థే ఉంది. ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. సీఐడీని ప్రైవేట్ సైన్యంలా వాడుకుని దొరికిన వాళ్లని అరెస్టు చేసేవాళ్లు. చిన్న ఫేస్ బుక్ పోస్ట్ పెడితే లాక్కెల్లేవాళ్లు. ఇక ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ అనే వ్యక్తి పేరు కూడా ఎత్తకుండా ఆయన భార్యలను కార్లు అంటూ అవమానించారు. చంద్రబాబు భార్య గురించి అసెంబ్లీలోనే ఘెరంగా మాట్లాడించి..చివరకు అంత పెద్దాయన్ను ఏడిపించారు. బాడీ షేమింగ్, వ్యక్తిగత హననం చాలా సామాన్యమైన విషయాల్లా మార్చేశారు. ఇది ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే.. జగన్ తో విబేధించినందుకు ఆయన సొంత చెల్లిని దారుణంగా వేధించారు. అలాంటి మాటలు, పోస్టులను మామూలు జనం కూడా అసహ్యించుకున్నారు. 


ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆయన చేసిన తప్పులు మాత్రమే. కూటమి కట్టడం.. టీడీపీ జనసేన కలిసి పనిచేయడం.. చంద్రబాబు అరెస్ట్ ఇంకా చాలా కారణాలున్నాయి. కానీ నేను జగన్ వైపు నుంచి ఉన్న తప్పులు గురించి మాత్రమే ప్రస్తావించాను. ఇన్ని మంచి పనులు చేసినా నన్ను ఎందుకు ఓడించారు అని ఆయన బాధ పడటం ఆశ్చర్యంగా ఉంది. మంచి పనులు చేస్తే.. ఎందుకు ఓడిస్తారు. పైగా కొన్ని పనులు జనం అర్థం చేసుకోలేదు అందరికి చేరలేదు అనుకోవడానికి లేదు. వచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉంది. చాచి కొట్టినట్లు ఉంది. ఆ స్థాయి ఓటమి అంటే పరిపాలనను ఈసడించుకున్నట్లు ఉంది. దానిని గుర్తించకుండా జనాన్ని నిందిస్తే.. ఉపయోగం ఏంటి జగన్.. గారూ...?