YSRCP News :   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరాజయం ఆ పార్టీకి అనేక సవాళ్లను తెచ్చి పెట్టనున్నాయి. ముందుగా పార్టీ నేతలకు ధైర్యం ఇవ్వాల్సి ఉంది. గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలతో వైసీపీ లీడర్లు అధికార పక్షానికి టార్గెట్ అవుతారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. వ్యాపారాలను కూడా మూసివేసుకోవాల్సి వచ్చింది.  ఇలా వందల మంది ఉన్నారు. కొంత మంది పార్టీలు మారిపోయారు. చాలా మంది నష్టపోయారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినందున వారెవరూ కామ్ గా ఉండే అవకాశం లేదు. 


తప్పు చేసిన వాళ్లను వదిలేది లేదంటున్న టీడీపీ 


టీడీపీ నుంచి వచ్చే ప్రతీకార రాజకీయాలను తట్టుకునేందుకు లీడర్,క్యాడర్ ఖచ్చితంగా సేఫ్ జోన్ చూసుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే వైసీపీలో ఉండటమే వారికి సేఫ్ అని పార్టీ అధినాయకత్వం నమ్మించాల్సి ఉంది  వైసీపీ ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయని.. టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ముఖ్యంగా  ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోళ్ల అంశంలో భారీ స్కాం జరిగిందని విచారణ జరిపిస్తే అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న అరవై మంది జైలుకు వెళ్తారని ప్రకటనలు చేశారు.వీరిలో దాదాపు అందరూ ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీ వైపు నుంచి వచ్చే దాడిని తట్టుకోవడం అంత సులువు  కాదు. 


గ్రామ స్థాయి రాజకీయాల్లో మరింత కష్టం


ఇక గ్రామ స్థాయి రాజకీయాల గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతీ గ్రామంలోనూ టీడీపీ, వైసీపీ క్యాడర్ మధ్య  తీవ్ర స్థాయి వివాదాలున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేతలకు అధికారం అండగా ఉంటుంది. వైసీపీ నేతలకు రాజీపడటం తప్ప మరో మార్గం ఉండదు.  రాజీ పడాలంటే పార్టీ మారిపోవాల్సి ఉంటుంది. ఇలాంటివి రాజీపడలేని  స్థాయిల్లో ఉంటాయి కాబట్టి క్యాడర్ ను కాపాడుకోవడం.. వైసీపీకి అంత తేలిక కాదని అనుకోవచ్చు. ఎందుకంటే..  ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా ప్రశాంతంగా ఉండలేరు. 


వైసీపీ హయాంలో తీవ్రంగా నష్టపోయిన నేతలు 


జగన్మోహన్ రెడ్డి పాలనలో టీడీపీ నేతల్ని ఘోరంగా వేధించారని అంటున్నారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం వ్యాపారాలన్నీ కోల్పోయింది. గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు సహా ఇతర ముఖ్య నేతలు తమ వ్యాపారాలను వదిలేసుకోవాల్సి వచ్చింది. ఆర్థికంగా నష్టపోయారు. అదే సమయంలో జగన్ లిక్కర్ బిజినెస్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో దొరికిన గోవా మద్యం అంతా లోకల్ లో తయారు చేయించారని అనుమానిస్తున్నారు. మద్యం బ్రాండ్లు అన్నీ బినామీలవేనని..  అన్నీ బయటకు తీస్తామంటున్నారు. ఇసుక విషయంలో  ఇప్పటికే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇలా అనేక విషయాల్లో విచారణలు చేయడానికి అవకాశం ఉంది. 


పరిమిత బలం - ఎవరి సపోర్టూ లభినంచని పరిస్థితి


అధికారంలో ఉండి ప్రతిపక్ష నేతలను వేధించిన తర్వాత అధికారం కోల్పోతే.. జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ పరిస్థితిని ఊహించి హింస జరగకుండా ప్రత్యేక బలగాలను ఈసీ ఏపీ మొత్తం మోహరించింది.  ఆవేశంలో జరిగే దాడుల్ని ఆపగలరు కానీ..అధికారం ఉపయోగించి చేసే దాడుల్ని ఆపలేరని వైసీపీ ఇప్పటికే నిరూపించింది.  దాన్ని టీడీపీ అనుసరిస్తే.. కాచుకోవడం చాలా కష్టమే అనుకోవచ్చు.