Andhra Pradesh News: అనంతపురంలో జిల్లా తాడిపత్రిలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. పోలీసు బందోబస్తు ఉన్న టైంలోనే రాత్రి కూడా ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యేతోపాటు ఇతర ముఖ్య నేతలను వేరే ప్రాంతాలకు పంపేశారు. తాడిపత్రి ఇప్పుడు ఖాకీవనంలో మారిపోయింది. అడుగడుగునా పోలీసులు కనిపిస్తున్నారు. 144 సెక్షన్ విధించి అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు.


పోలింగ్ తర్వాత తాడిపత్రిలో  మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థులే రోడ్లపైకి వచ్చి ప్రత్యర్థులకు వార్నింగ్‌ ఇవ్వడం, వారి ప్రధాన అనుచరులు దాడులకు తెగబడటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. సీమ ప్యాక్షన్ నాగు మళ్లీ పడగ విప్పింతా అన్నట్టు రణరంగం సాగింది.  ఇప్పటికీ ఆ హైటెన్షన్ కొన సాగుతూనే ఉంది. 


తాడిపత్రిని రౌండప్‌ చేసిన పోలీసులు ముందు జాగ్రత్తగా కీలక నేతలను లిఫ్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డితో సహా అస్మిత్ రెడ్డిని సీక్రెట్‌ ప్రాంతాలకు తరలించేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పెద్దారెడ్డిని కూడా అక్కడి నుంచి పంపేశారు. 


కీలక నేతలు తాడిపత్రిలో లేనందున గొడవలు సద్దుమణుగుతాయని భావిస్తున్నారు. అందుకే తాడిపత్రిలో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు ఒకరిపై దాడి జరగడం కలకలం రేపింది. 


జెసి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు దాసరి కిరణ్‌ను అత్యంత దారుణంగా అటాక్ చేశారు. ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులం అంటూ వచ్చిన ఓ బ్యాచ్‌ ఆయనపై దాడి చేసింది. వేట కొడవళ్లతో విరుచుకు పడింది. 


ప్రత్యర్థుల చేతిలో తీవ్రంగా గాయపడిన కిరణ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ముందు తాడిపత్రిలోనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసు పహారాలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 


తాడిపత్రిలో పారామిలటరీ బలగాలతోపాటు వందల సంఖ్యలో పోలీసులు ఉన్న టైంలోనే దాడి జరగడం అందర్నీ భయాందోళనకు గురి చేస్తోంది. టీడీపీ శ్రేణులతోపాటు సామాన్య ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.