Karnataka Telugu : కర్ణాటక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కొంత మంది సినీ నటులు కూడా ప్రచారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు బెంగళూరులోనే మకాం వేశారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెంగళూరులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏపీ నుంచి ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా పర్యటిస్తున్నారు. తెలుగు కమ్యూనిటీలతో సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీకే మద్దతివ్వాలని కోరుతున్నారు.
ఉత్తర కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్, హోసూర్, కోలార్, బీదర్, గంగావతి, రాయచూర్, కొప్పోల్, గుల్బర్గా, వంటి చాలా ప్రాంతాల్లో తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు. అక్కడ చాలా మంది కన్నడ వారు కూడా తెలుగు మాట్లాడగలరు. అందువల్ల సరిహద్దు ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల నేతలు ప్రచారానికి వెళ్తున్నారు. రెండు రోజుల్లో ప్రచారం ముగుస్తుంది. అందుకే కీలక నేతలంతా అక్కడే మకాం వేశారు. ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ప్రచారం ప్రారంభమయినప్పటి నుండి అక్కడే ఉన్నారు. ప్రధాని మోదీ పర్యటనల్లో ఆయన బాధ్యతలు నిర్వహించారు. సోము వీర్రాజు సహా పలువురు నేతలు కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... కర్ణాటక కాంగ్రెస్ నేత శివకుమార్‌తో కలిసి ప్రచారం, ర్యాలీల్లో పాల్గొంటున్నారు. బీజేపీ తరపున బ్రహ్మానందం చిక్ బళ్లాపూర్‌లో ప్రచారం చేశారు. చిక్కబళ్లాపుర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుధాకర్ కు మద్దతుగా ప్రచారం చేశారు. సుధాకర్ ఎంతో మంచివాడని.. ఆయన చేసిన మంచి పనులను గుర్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ప్రచారంలో బ్రహ్మానందం సినిమా డైలాగ్ చెప్పి అలరించారు. ఖాన్స్ తో గేమ్స్ ఆడొద్దు శాల్తీలు లేచిపోతయ్ అని అనడంతో ఫ్యాన్స్ ఈలలు వేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ అదేమీ లేదని తేలిపోయింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10 న జరగనుండగా, మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. కాగా రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.