తెలంగాణ రాష్ట్ర సమితి ఇరవై ఒక్క ఏళ్లు పూర్తి చేసుకుంది. అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించింది. బంగారు తెలంగాణ వైపు అడుగులేస్తున్నామని ధీమాగా చెబుతోంది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ముందు మరో టాస్క్ రెడీగా ఉంది. అదే అధికారాన్ని కాపాడుకోవడం. జాతీయ స్థాయిలో ఉనికి చాటేలా ప్రయత్నించడం. 
 
తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన టీఆర్ఎస్ !


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే భావనే చాలా మంది మదిలోనుంచి తొలగిపోయిన వేళ కేసీఆర్ టీఆర్ఎస్ ను కేసీఆర్ స్థాపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు, నిధులు, నియమకాల్లో అన్యాయం జరుగుతోందని.. ప్రత్యేక రాష్ట్ర సాధనే దానికి మార్గమని ఉద్యమించారు. కేసీఆర్ ఎప్పుడూ చెబుతున్నట్లుగా పిడికెడు మందితో ప్రారంభమై... కోట్ల మంది చేరి.. ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసే వరకూ సాగింది. ఉద్యమంలో సకల జనులను ఏకం చేశారు. ఇరవై ఒక్క ఏళ్ల కిందట జలదృశ్యంలో ప్రారంభమైన టీఆర్ఎస్ ఎవరూ ఊహించనంతగా ఎదిగింది. ఎదుగుతూనే ఉంది.



ఆమరణదీక్షతో చరిత్ర సృష్టించిన కేసీఆర్ ! 


2009 ఎన్నికల్లో మహాకూటమిగా పోటీ చేసి 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు పరిమితం కావడంతో పరిస్థితి ఇంకా దిగజారింది. 2009 ఎన్నికల తర్వాత  అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన ఎత్తులు, వ్యూహాలను తట్టుకోలేక టీఆర్ఎస్ విలవిల లాడింది. పార్టీ నేతలంతా కాంగ్రెస్ బాట పట్టారు. పార్టీ పూర్తిగా కుదేలైన సమయంలో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. అక్కడ నుంచి తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడం టీఆర్ఎస్ కు ఊహించని స్థాయిలో కలిసొచ్చాయి. కేసీఆర్ చేపట్టిన దీక్ష సకల జనులను కదిలించడంతో డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తామని కేంద్రం చేసిన ప్రకటన టీఆర్ఎస్ కు కొత్త ఊపు తెచ్చింది. ఆ తర్వాత ఆలస్యం అయినా .. అది టీఆర్ఎస్‌కు మరింత మేలు చేసింది. ఉద్యమ పార్టీగా.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీగా ప్రజల మన్ననలు అందుకుంది.  


ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మార్చేసిన కేసీఆర్ !


తెలంగాణ సాధనే లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్‌ను స్థాపించారు. తెలంగాణ సాధించేవరకూ ఉద్యమపార్టీగా చెప్పేవారు. ఆ తర్వాత బంగారు తెలంగాణ సాధనలో రాజకీయ పార్టీగా మారిపోయిందనికేసీఆర్ ప్రకటించారు. బంగారు తెలంగాణ కోసం రాజకీయ పునకేకీకరణ చేసారు . తెలంగాణలో తిరుగులేదనే స్థాయికి చేర్చారు. ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్‌ను జాతీయ స్థాయిలో కీలకంగా నిలబెట్టాలనుకుటున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తేవాలనుకుంటున్నారు. ఆ దిశగానే తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఎజెండాగా పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ మిషన్ జాతీయ రాజకీయాలు. 


 ముందున్నది టీఆర్ఎస్‌కు లిట్మస్ టెస్ట్ !


ఇప్పుడు టీఆర్ఎస్ క్రాస్ రోడ్స్‌లో ఉంది. ఓ వైపు రెండు సార్లు అధికారలో ఉన్నందువల్ల వచ్చిన అధికారిక వ్యతిరేకత.. మరో వైపు దూసుకొస్తున్న బీజేపీ తరహా రాజకీయాలు.. సంస్థాగతంలో బలంగా ఉన్న.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రయత్నాలు టీఆర్ఎస్‌కు సవాల్‌గా మారాయి. వీటన్నింటినీ కాచుకుంటూ ఢిల్లీకి గురి పెట్టారు కేసీఆర్. వచ్చే ఏడాదిన్నర ఆ పార్టీకి ఓ సవాల్ లాంంటిది. అయితే ఎన్నో సవాళ్లను అధిగమించిన కేసీఆర్ దాన్ని వాటిని కూడా సులువుగానే అధిగమిస్తారని టీఆర్ఎస్ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి. 4