తెలంగాణ రాష్ట్రంలో కొద్ది వారాలుగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మూడో సారి కూడా అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పార్టీ గట్టి నమ్మకంతో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలను గులాబి పార్టీని తిరస్కరించారు. మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఫలితాలు ఇంకా పూర్తి స్థాయిలో విడుదల కాకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఊహించని దాని కంటే చాలా తక్కువ స్థానాలు గెల్చుకుంది.


దీంతో తెలంగాణలో కొత్త సీఎం డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలోనే ప్రమాణ స్వీకారం ఉంటుందని రేవంత్ రెడ్డి గతంలోనే వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఇంకా ఎవరినీ ఖరారు చేయనప్పటికీ, ఎవర్ని ముఖ్యమంత్రిని చేసినా డిసెంబరు 9నే ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ పుట్టిన రోజు కావడం విశేషం. సోనియాను పార్టీ నేతలు అందరూ దేవతగా ఆరాధించే సంగతి తెలిసిందే. అందుకే ప్రమాణ స్వీకారానికి ఆ ప్రత్యేకమైన రోజును ఎంపిక చేసుకున్నారు.