Telangana CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిశై సౌందర రాజన్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగిన  కార్యక్రమంలో ప్రమాణం చేయించారు. రేవంత్ అనే నేను అని .. పలకగానే స్టేడియం హోరెత్తిపోయింది. 


రేవంత్ తో  పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణం చేశారు. రేవంత్ రెడ్డి తర్వాత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర్ రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ , కొండా సురేఖ, సీతక్క,  తుమ్మల నాగేశ్వరరావు,  జూపల్లి కృష్ణారావు వరుసగా ప్రమాణం చేశారు.                  


మంత్రులందరూ ప్రమాణ స్వీకారం తర్వాత సోనియా, రాహల్ గాంధీలతో పాటు ముఖ్య నేతలందరికీ నమస్కరించారు. అయితే అందరూ సీతక్కకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు .. సోనియా లేచి నిలబడి..  ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక కూడా సీతక్కను ప్రత్యేకంగా అభినందించారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత సీతక్క పార్టీ కష్టపడ్డారు. భారత్ జోడో యాత్రలో కూడా కీలక పాత్ర పోషించారు. మహిళా కాంగ్రెస్ కీలక బాధ్యతల్లో ఉన్నారు. పైగా ఆమె నక్సల్ ఉద్యమం నుంచి ప్రజా రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే.. సీతక్కపై అందరూ ప్రత్యేకమైన గౌరవం చూపించారు. ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా ఉండటం వల్ల ప్రతి సందర్భంలోనూ సీతక్క ప్రత్యేకంగా  నిలుస్తున్నారు.                    


ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలందరూ తరలి వచ్చారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఇతర నేతలు కూడా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ముఖ్యమైన నేతలందరూ తరలి రావడంతో హైదరాబాద్ మొత్తం సందడిగా మారింది.                                           


ముందుగా  పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో కలిసి ప్రత్యేక వాహనంలో రేవంత్‌ వేదిక వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.  


తెలంగాణ నూతన స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయన్ను స్పీకర్‌గా ఎంపిక చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది.