Prof Kodandaram News: నల్లగొండ: తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య ధరణి వెబ్ సైట్ (Dharani Portal) పై ఆరోపణల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసివేస్తామని చెబుతోందని, అందుకే వాళ్లకు ఓటు వేయవద్దని సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ధరణి కారణంగా వేలాది మంది తమ స్థలాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ధరణి వెబ్ సైట్ (Prof Kodandaram on Dharani Website)పై సంచలన ఆరోపణలు చేశారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ పెద్దలు హైదరాబాద్ పరిసరాల్లో 7, 8 వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. అందుకే ఆయనకు ధరణి ఉండాలని సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో " 10 ఏళ్ల తెలంగాణ - ప్రజల ఆకాంక్షలు - కర్తవ్యాలు " తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొ.కోదండరాం పలు విషయాలను ప్రస్తావించారు. 


భూముల వివరాలు పొందుపరిచే ధరణి వెబ్ సైట్ తెచ్చాక రాష్ట్రంలో సమస్యలు పెరిగాయని, సామాన్యులు భూమిని కోల్పోయారని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి పేద రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్న కారణంగా ధరణిని తొలగించాలని డిమాండ్ చేశారు. ధరణి లేకముందు రాష్ట్రంలో 30 వేల వరకు రెవెన్యూ సమస్యలు ఉండగా, ధరణి వచ్చాక ఆ సమస్యలు 20 లక్షలకు పెరిగిపోయాయని చెప్పారు. పేర్లు తప్పులు రాసి ఎంట్రీ చేయడం వల్ల ధరణిలో వివరాలు మార్చడం వీలుకాదని, సామాన్యుడు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు మార్చే అధికారం ఎమ్మార్వో, కలెక్టర్ దగ్గర లేదని, హైదరాబాద్ కు వెళ్లి మార్చుకోవాల్సి వస్తోందన్నారు. కంప్యూటర్ లో ఎంట్రీ చేయించడానికి తనకే ఒకరోజు సమయం పట్టిందని, సామాన్యులు, రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. మీ సేవా లో ఎవరైనా సరిగ్గా ఎంట్రీ చేయిస్తే.. హైదరాబాద్ వెళ్లి కష్టపడి తమ భూమిని తమ పేరిట మార్పించుకునే ఛాన్స్ ఉంటుందన్నారు. 
Also Read: Telangana Elections 2023: 'బీఆర్ఎస్ పాలనలో అవస్థలు, అవమానాలు తెలుసు' - ప్రజా ప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ


ధరణి ఎక్కడికి పోదు.. మెరుగైన వ్యవస్థ కావాలి
సీఎం కేసీఆర్ చెబుతున్నట్లుగా ప్రభుత్వం మారితే ధరణి తొలగించరని, అయితే మెరుగైన రెవెన్యూ వ్యవస్థ, సాఫ్ట్ వేర్ రావాలన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు ఏ ఫీజు లేకుండా సమస్యలు పరిష్కరిస్తే సరిపోతుంది. ప్రత్యేక రెవెన్యూ కోర్టు పెడితే ప్రజల భూముల సమస్యలు తీరుతాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 7 నుంచి 8 వేల వరకు భూములను ఆయన తన పేరిట నమోదు చేసుకున్నారని, అందుకే ధరణి పోవద్దు అని చెబుతున్నారని కోదండరాం చెప్పారు. రికార్డులో తప్పులు దొర్లిన వారున్నారు, కొన్ని భూములకు రిజిస్ట్రేషన్ లేదు. నాపేరు మీద ఎక్కించిన భూమి నాదేనని, సగం నాకు ఇస్తేనే నీకు సగం వాటా ఇస్తానని అసలు భూ యజమాని ఇలా నష్టపోతున్నారని ప్రొఫెసర్ వివరించారు. ఇలాంటి కారణాలతోనే ధరణి వెబ్ సైట్ ను పూర్తిస్థాయిలో మార్చాల్సిన అవసరం ఉందన్నారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply