Revanth Reddy Letter to Political Leaders: తెలంగాణ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanthreddy) రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులకు బహిరంగ లేఖ (Open Letter) రాశారు. ఎన్నికల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమని అన్నారు. బీఆర్ఎస్ (BRS) పదేళ్ల పాలనలో మీకు జరిగిన అవమానాలు తనకు తెలుసునని చెప్పారు. ప్రభుత్వ పాలనకు స్థానిక ప్రజా ప్రతినిధులే పునాదులని, జెడ్పీటీసీగా చేసిన తనకు వారి బాధ్యతలు, కష్టాలు తెలుసని, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రతినిధుల గౌరవం పెంచే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని లేఖలో పిలుపునిచ్చారు.
'మీ బాధలు నాకు తెలుసు'
'జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాకు స్థానిక ప్రజా ప్రతినిధుల బాధ్యత తెలుసు. ఏ పాలనకైనా మీరే పునాదులు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మీ అవస్థలు, మీకు జరిగిన అవమానాలు నాకు తెలుసు. ప్రజా క్షేత్రంలో మిమ్మల్ని కేసీఆర్ పురుగుల కంటే హీనంగా చూశారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయి. సర్కారు నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారు. ఊరి కోసం అప్పు చేసి వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు ఉపాధి కూలీలుగా, వాచ్ మెన్లుగా చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయి.' అని రేవంత్ రెడ్డి లేఖలో వివరించారు.
'ఇదొక అవకాశం'
స్థానిక సంస్థలు, ప్రజా ప్రతినిధులకు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని, పార్టీలు, అజెండాలు పక్కన పెట్టాలని అన్నారు. మీ ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి ఇది ఓ గొప్ప అవకాశంగా అభివర్ణించారు. కాంగ్రెస్ గెలుపనకు కృషి చేయాలని, మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్ వరకూ, కౌన్సిలర్ నుంచి మున్సిపల్ ఛైర్మన్ వరకూ, కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకూ అందరికీ లేఖలో విజ్ఞప్తి చేశారు.
దేశంలోని అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ వ్యవస్థలను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీల చేత దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున కొట్లాడే వారు ద్రోహులా అంటూ లేఖలో ప్రశ్నించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply