Telangana News: గోషామహల్‌, కరీంనగర్‌, కోరుట్ల స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గోషామహల్‌ సహా ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ఓడిస్తామని చెప్పారు. తెలంగాణ భవన్ లో ఆదివారం మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీని నిలువరించే శక్తి కేవలం బీఆర్‌ఎస్‌ కు మాత్రమే ఉందని.. ప్రధాని మోదీని ప్రశ్నించే ధైర్యం, దమ్ము రేవంత్‌ రెడ్డికి లేదని అన్నారు. ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్‌ నేతలపైనే జరుగుతున్నాయనడం సరికాదని, బీఆర్‌ఎస్‌ నాయకులపై కూడా దాడులు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు.


నవంబర్ 29 దీక్షా దివాస్


తెలంగాణ జాతిని ఏకం చేసిన రోజు నవంబర్‌ 29 అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆ రోజునే ఉద్యమానికి బీజం పడిందని అన్నారు. 14 ఏళ్లుగా నవంబర్‌ 29న దీక్షా దివాస్‌ జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాది కూడా దీక్షా దివస్‌ను నిర్వహిస్తామని అన్నారు. దీక్షా దివస్‌లో తెలంగాణ ప్రజలంతా ఎక్కడికక్కడ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు.


రైతు బంధుపై విమర్శలొద్దు
రైతు బంధు పథకం కేసీఆర్‌ పేటెంట్‌ అని.. ఆ పథకం కొత్తది కాదని అన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకానికి ఎన్నికల కోడ్‌ వర్తించబోదని అన్నారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేస్తే రేవంత్‌ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రైతుల పట్ల కాంగ్రెస్‌కు చిత్త శుద్ధిలేదని అన్నారు. పీఎం కిసాన్‌ నిధులు ఇస్తే తప్పు లేదుకానీ రైతు బంధు ఇస్తే తప్పా అని నిలదీశారు. ఆ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీది అట్టర్‌ ప్లాప్‌ ప్రభుత్వమని చెప్పారు. కాలం చెల్లిన కాంగ్రెస్‌ ఎంతవాగినా కానీ, లాభం ఉండబోదని విమర్శించారు. కర్ణాటక కాంగ్రెస్‌ నాయకులను తెలంగాణ ప్రజలు పట్టించుకోబోరని చెప్పారు.


రాహుల్‌ గాంధీ 2014 నుంచి నిరుద్యోగిగా ఉన్నారని ఎగతాళి చేశారు. ఆయన ఉద్యోగం చేసిన వ్యక్తి కాదని, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నదీ లేదని అన్నారు. కర్ణాటకలో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు అక్కడ ఒక్క నోటిఫికేషన్‌ కూడా రాలేదని కేటీఆర్ గుర్తు చేశారు.