Gangula Kamalakar in Karimnagar: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలా నిలిచిన ప్రాంతం కరీంనగర్ (Karimnagar Politics). మలిదశ ఉద్యమాన్ని మలుపుతిప్పిన కరీంనగర్‌లో ఎప్పుడూ కారు పార్టీదే హవా. కానీ ఈ సారి పరిస్థితి అంత ఈజీగా లేదు. ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో పట్టు సడలుతోంది. మంత్రి గంగుల గట్టెక్కుతారా లేదా అన్న సందేహం ఆ పార్టీలోనే మొదలైంది. మూడు దఫాలుగా కరీంనగర్ నుంచి ఎన్నికవుతున్న గంగుల కమలాకర్ (Gangula Kamalakar) కు ఈ సారి గట్టి పోటీనే ఎదురవుతోంది.
మంత్రి గంగుల మరోసారి కష్టమా
వరుసగా మూడుసార్లు గెలిచిన గంగుల కరీంనగర్‌లో తిరుగులేని నేతగా ఉన్నారు. టీడీపీ తరుపున కార్పోరేటర్‌గా ఎన్నికై రాజకీయాల్లోకి వచ్చిన గంగుల 2009లో ఆ పార్టీ తరపునే గెలిచారు. 2014 లో తెలంగాణ ఏర్పాటు కంటే ముందే బీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2014లో అప్పట్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి 25వేల మెజార్టీతో బండి సంజయ్‌పై గెలుపొందారు. 2018లో కూడా బండి సంజయ్ (Bandi Sanjay) పైనే రెండోసారి 14వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి గంగుల బండి సంజయ్ తలపడుతున్నారు. పోటీ వీళ్లద్దరి మధ్యే ఉండగా.. కాంగ్రెస్ పార్టీ పురుమళ్ల శ్రీనివాస్ రంగంలోకి వచ్చారు.
ముక్కోణపు పోటీ ఖాయమా
మూడు సార్లు గెలిచాక సహజంగా ఉండే ప్రజావ్యతిరేకతతో పాటు.. ఈ మధ్య కాలంలో అందరినీ కలుపుకుని పోవడం లేదన్న అసంతృప్తి గంగులపై ఉంది. ప్రతీసారి మైనార్టీ ఓట్లతో నెగ్గుతున్న గంగులకు ఇప్పుడు వాళ్లే వ్యతిరేకమయ్యారు. సొంత పార్టీ నుంచి ఎమ్మెల్యీ సంతోష్ కుమార్ కాంగ్రెస్ లో చేరగా.. పార్టీలో ఉండీ.. కొంతమంది గంగులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో వారి స్థలాలను గంగుల అనుచరులు కబ్జా చేశారని.. దీనిపై ఆయన స్పందించకపోవడంతో ఆ వర్గాలు బాగా అసంతృప్తిగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతకు తోడు గంగుల స్వయంగా కొంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ది పనులు, రివర్ ఫ్రంట్ డవెలప్‌మెంట్, తీగల వంతెన వంటి భారీ పనులు చేపట్టినప్పటికీ.. అభివృద్ధి ని అవినీతి డామినేట్ చేసిందంటున్నారు.
ఇక వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో పాటు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా దూరం కావడంతో బండి సంజయ్ పై బాగా సంపతీ ఉంది. ఎప్పటి నుంచో అక్కడే రాజకీయాలు చేస్తున్న స్థానికుడు కావడంతో సింపతీ వర్కవుట్ అయితే ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ఇక కాంగ్రెస్ కూడా ఈ దఫా గట్టిపోటీ ఇస్తుంది. కరీంనగర్ పట్టణ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థికి గట్టి పట్టు ఉంది. సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉండటంతో లోకల్‌గా సంబంధాలు ఎక్కువుగా ఉన్నాయి. కొన్ని వార్డుల పరిధిలో ఏకమొత్తంగా కాంగ్రెస్‌ను బలపరిచే పరిస్థితి ఉంది. గంగులకు దూరం అయిన ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లుతున్నాయి. సొంత ఇమేజ్, ముస్లిం ఓట్లు, కాంగ్రెస్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన బలం వంటి కారణాలు కలిసొస్తే.. పురుముళ్ల కూడా జెండా ఎగరేయొచ్చు.