Telangana elections 2023: తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సాయంత్రం(మంగళవారం) సమావేశం కానుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది. ఇప్పటికే ఆశావహుల నుంచి అర్జీలు స్వీకరించిన పీసీసీ.. వాటి పరిశీలిస్తోంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 1025 దరఖాస్తులు వచ్చాయ్. 


అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు వచ్చిన 1025 దరఖాస్తులపై ఎలక్షన్ కమిటీలో చర్చించనుంది. సాయంత్రం నాలుగు గంటలకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. దరఖాస్తులు ఆహ్వానించిన తర్వాత మొదటిసారి సమావేశం అవుతోంది. నియోజకవర్గాల వారీగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో జాబితాను రెడీ చేయనుంది. నియోజకవర్గాల వారీగా ఆర్జీలను వేరు చేస్తున్నారు. రిజర్వేషన్ నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులను.. రిజర్వేషన్ కానీ జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చిన వాటిని వేర్వేరుగా పరిశీలిస్తున్నారు. అదే విధంగా బీసీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల సంఖ్యను కూడా నియోజకవర్గాల వారీగా వేరు చేస్తున్నారు. 


అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విధివిధానాలను ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించనుంది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మరోసారి ఎలక్షన్ కమిటీ సమావేశమై...జాబితాను షార్ట్ లిస్టు చేసి...స్క్రీనింగ్ కమిటీకి పంపనుంది. ఎలక్షన్ కమిటీ నుంచి ఎంపిక చేసిన జాబితాపై పార్టీ సర్వే కూడా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీకి ఆయా నియోజకవర్గాల్లో బలం ఎంతుంది ?  అభ్యర్థితో పార్టీకి కలిసి వచ్చే అదనపు అంశాలు ఏంటి ? వంటి అంశాలపై కాంగ్రెస్ సర్వే చేయనుంది.  


సర్వే నివేదికలతో పాటు ఎలక్షన్ కమిటీ రూపొందించిన జాబితాను స్క్రీనింగ్ కమిటీకి అందజేయనున్నారు. స్క్రీనింగ్ కమిటీ సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. ఈ కమిటీ జిల్లాల వారీగా పర్యటనలు చేసి అభ్యర్థులను ఖరారు చేయనుంది. పూర్తిస్థాయిలో అభ్యర్థుల జాబితా సెప్టెంబర్ నెలాఖరులోపు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే మూడో వారంలో 30 నుంచి 40 అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది.


ఎక్కువ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో నాయకులను పిలిచి నచ్చ చెప్పాలన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. టికెట్ రానివారికి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. వీలైనంతవరకు అందరికీ నచ్చజెప్పి వివాదాలు లేకుండా ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తోంది. టికెట్ ఎవరికి వచ్చిన ఆశావాహులు అందరూ కలిసి పని చేస్తే గెలుపు ఈజీ అవుతుందని నచ్చ జెప్పేందుకు రెడీ అవుతోంది.  


దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సామాజిక పరిస్థితులు, ప్రజల్లో పేరు, సామాజిక సేవా కార్యక్రమాలు వంటి అంశాలపై ఆరా తీస్తోంది. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వే చేపట్టడంతో...దరఖాస్తు చేసుకున్న నేతల్లో టెన్షన్ మొదలైంది. సర్వేల్లో వచ్చిన రిపోర్టుల అధారంగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది. 


ఇది అంత ఈజీగా తేలే వ్యవహారం కాదంటున్నారు మరికొందరు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఒకే మీటింగ్‌లో మొత్తం 115 సీట్లను ప్రకటించేసిన కేసీఆర్‌.. అసంతృప్తులను కూడా అదే స్ట్రైల్‌లో బుజ్జగిస్తున్నారు. అయితే కాంగ్రెస్ రాజకీయమే చాలా వైవిధ్యంగా ఉంటుంది. అంతర్గత  ప్రజాస్వామ్యం అని వాళ్లు చెప్పుకున్నా... కుమ్ములాటలకు కొదవ లేని పార్టీ అది. అందుకే ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు రెబల్ అవుతారో అన్న టెన్షన్ మాత్రం కాంగ్రెస్ అధినాయకత్వంలో ఉంది. ముందు నుంచే వారిని బుజ్జగించే పనిలో కొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.