తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు...ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను వడపోస్తోంది. కమలం పార్టీ సైతం ఆశావహుల నుంచి అప్లికేషన్లను ఆహ్వానించింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఊహించని విధంగా దరఖాస్తులు వచ్చాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సామాన్య కార్యకర్తలు సైతం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్లకు ఎలాంటి రుసుం లేకపోవడంతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వారం రోజుల్లేనే ఏకంగా 6వేల 11 అప్లికేషన్లు వచ్చాయ్. బీజేపీకి అభ్యర్థులే లేరన్న కామెంట్లకు దరఖాస్తులతో నోరు మూయించింది. 


6వేలకుపైగా దరఖాస్తులు రావడంతో...బీజేపీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. వచ్చిన అప్లికేషన్లను వడపోసేదెలా ? అన్నదే ఇప్పుడు కాషాయ పార్టీకి ఇబ్బందిగా మారింది. 119 నియోజకవర్గాలకు అభ్యర్థులన ఎలా ఎంపియా చేయాలి ? తీవ్రంగా పోటీ నియోజకవర్గాల్లో ఎవరికి సీటు ఇవ్వాలి ? ఒకే సీటుకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్న చోట్ల ఏం చేయాలి ? ఒకరికి టికెట్ ఇస్తే...మరొకరికి ఎలా నచ్చజెప్పాలన్న దానిపై నేతలు తలమునకలయ్యారు. ఇప్పటి వరకు అప్లికేషన్ పరిశీలకు కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. త్వరలో కమిటీని ఏర్పాటు చేసి నియోజకవర్గానికి రెండు మూడు పేర్లను ఎంపిక చేసి హైకమాండ్ కు పంపాలన్న యోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. 


బీజేపీలో తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్‌తో పాటు రాజ్యసభ ఎంపీగా లక్ష్మణ్ కొనసాగుతున్నారు. వీరిలో ఏ ఒక్కరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోలేదు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ రాం చందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం దరఖాస్తు చేసుకోలేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అమెరికా పర్యటనలో ఉండటంతో ఆయన దరఖాస్తు చేసుకోలేకపోయారు. ముగ్గురు ఎమ్మెల్యేలుండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ సస్పెండ్ చేసింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రమే అప్లికేషన్ ఇచ్చారు.  హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దరఖాస్తు చేసుకోలేదు. 


దరఖాస్తు ప్రక్రియలో పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య కార్యకర్తలకే అప్లికేషన్లా? కీలక నేతలకు ఎలాంటి దరఖాస్తు ప్రక్రియ అక్కర్లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బడా నేతలకొక లెక్క.. చోటా లీడర్లకొక లెక్క అన్నట్లుగా తీరు మారిపోయింది. కీలక నేతల దరఖాస్తులు ఎందుకు రావడంలేదని పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినా...రాష్ట్ర నాయకత్వం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవాల్సిందేనన్న హైకమాండ్ ఆదేశాలను ధిక్కరించినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సర్వే ఆధారంగా టికెట్ కేటాయిస్తారా? లేక ధన బలం చూసి కేటాయిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.