KTR Responds On Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. తన నియోజకవర్గంలో సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ విజయం సాధించారు. అనంతరం ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎన్నికల ఫలితాలు తమను అంతగా బాధించలేదు కానీ నిరాశ కలిగించాయని అన్నారు. రెండుసార్లు తమకు అధికారం అందించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫలితాలు తాము ఊహించలేదన్నారు.  గెలుపు దిశగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.





ఆదివారం ఎన్నికల కౌంటింగ్ ఉండగా.. అంతకుముందు రోజే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. హ్యాట్రిక్ లోడింగ్ అవుతుందని, విజయోత్సవాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు సైతం ఆయన పిలుపునివ్వడం విజయంపై ఆయన కాన్ఫిడెన్స్ కు నిదర్శనం. కానీ ఫలితాలు చివరిదశకు వచ్చేసరికి మంత్రి కేటీఆర్ నిన్న చేసిన హ్యాట్రిక్ లోడింగ్ ట్వీట్ పై స్పందించారు. ఈసారి టార్గెట్ గురితప్పింది, మా లక్ష్యాన్ని చేరుకోలేదు అని మంట్రి కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 




ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తరువాత సైతం తమదే విజయమని, పలు సంస్థలు గత ఎన్నికల తరహాలోనే తప్పుడు సర్వే ఫలితాలు ఇచ్చారంటూ కేటీఆర్ మండిపడ్డారు. కౌంటింగ్ రోజే అసలైన ఫలితాలు తెలుస్తాయని తమదే విజయమని కేటీఆర్ ధీమాగా ఉన్నారు. కానీ ఓటర్లు సైలెంట్ ఓటింగ్ చేశారు. ఎలక్షన్ ముందురోజు వరకు కేసీఆర్ వైపు ఉన్నట్లే కనిపించినా, హస్తం పార్టీకి ఓటేసి మార్పును కోరుకున్నారు. 


గత ఎన్నికల్లో 88 స్థానాల్లో నెగ్గిన బీఆర్ఎస్ ఈసారి అందులో సగం సీట్లను కూడా నెగ్గలేకపోయింది. మరోవైపు గత ఎన్నికల్లో 19 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 65 వరకు స్థానాల్లో విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. మరోవైపు బీజేపీ సైతం పుంజుకుంది.