నిర్మల్ జిల్లాలో రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఈ జిల్లాలో రెండు నియోజకవర్గాలే ఉన్నాయి. అవి ఒకటి నిర్మల్. రెండు ముధోల్. బీఆర్ఎస్ అధికారంలో ఉండడం, నిర్మల్ఎమ్మెల్యే మంత్రి కావడంతో జిల్లాలో ఆ పార్టీ బలంగానే ఉంది. కానీ, కొంతకాలంగా బీజేపీ బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తోంది. 2014 ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో బీఎస్పీ గెలుపొందగా.. ముధోల్‌లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక 2018 ఎన్నికల్లో నిర్మల్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి (టీఆర్‌ఎస్), ముథోల్ నుంచి జి.విఠల్ రెడ్డి (టీఆర్‌ఎస్) విజయం సాధించారు.
నిర్మల్ నియోజకవర్గంలో 2.38 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 1999, 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యార్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కాదని, ప్రజారాజ్యం తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. దీంతో ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్‌పి తరపున పోటీ చేసి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూచడి శ్రీహరిరావుపై 8,628 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇంద్రకరణ్ రెడ్డికి 61,368 ఓట్లు రాగా, కూచడి శ్రీహరిరావుకు 52,871 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 38,951 ఓట్లతో మూడో స్థానాన్ని సరిపెట్టుకున్నారు. ఆ తరువాత ఇంద్రకరణ్ రెడ్డి టిఆర్ఎస్‌లో చేరి కెసిఆర్ మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తరపున ఇంద్రకరణ్ రెడ్డే గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై 9,271 ఓట్ల మెజార్టీతో ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డికి 79,985 ఓట్లు రాగా, మహేశ్వర్‌రెడ్డికి 70,714 ఓట్లు వచ్చాయి. కేసిఆర్ రెండో మంత్రివర్గంలో కూడా స్థానం దక్కించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ టిక్కెట్టు దక్కించుకున్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి ఆరోసారి నిర్మల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ముధోల్ నియోజకవర్గంలో 1,86,418 మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో ముథోల్‌లో కాంగ్రెస్ గెలించింది. ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గడ్డం విఠల్‌రెడ్డి.. బీజేపీ అభ్యర్థి రమాదేవిపై 14,686 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విఠల్‌రెడ్డి 63,322 ఓట్లు రాగా, రమాదేవికి 48,485 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వేణుగోపాల చారికి 43,540 ఓట్లు వచ్చాయి. అయితే ఎన్నికల్లో గెలిచిన తరువాత విఠల్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగారు విఠల్‌రెడ్డి. బీజేపీ అభ్యర్థి రమాదేవిపై 43,364 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో విఠల్‌రెడ్డికి 83,703 ఓట్లు రాగా, రమాదేవికి 40,339 ఓట్లు వచ్చాయి. 43,364 ఓట్ల భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రమాదేవిని ఓడించారు విఠల్‌రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి పటేల్ పవార్ 36,396 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డిగారి విఠల్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక... ముధోల్ టికెట్ కోసం బీజేపీ నేతల్లో పోటీ ఎక్కువగా ఉంది. రెండుసార్లు పోటీచేసి ఓడిన జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, డీసీసీ అధ్యక్షుడిగా ఉండి కమలదళంలో చేరిన రామారావుపటేల్, నియోజకవర్గ సీనియర్‌నేత మోహన్‌రావుపటేల్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక.. కాంగ్రెస్ మాత్రం ముధోల్ నియోజకవర్గంలో సీనియర్ నేతలు లేరు. దీంతో ఈ ఎన్నికల్లో ముధోల్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది.