తెలంగాణలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు పోలీసులు. చెక్‌పోస్టులు పెట్టి వాహనాలు చెక్ చేస్తున్నారు. ఎన్నికల వేళ డబ్బు మద్యం తరలింపును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీస్తున్నారు. వీఐపీలు, ప్రముఖ రాజకీయ నేతల వాహనాలు కూడా వదలడంలేదు. ఏ వాహనం అయినా సరే... ఆపి చెక్ చేసిన తర్వాతే పంపుతున్నారు.
భారతీయ జనతా పార్టీ నేత, గజ్వేల్ అసెంబ్లీ అభ్యర్థి ఈటల రాజేందర్ వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలం వంటిమామిడి చెక్‌పోస్టు దగ్గర ఈటల రాజేందర్ కారును ఆపారు పోలీసులు. వాహనాన్ని తనిఖీ చేయాలని కోరారు. ఈటల రాజేందర్ కూడా పోలీసులకు సహకరించారు. దీంతో ఆయన కారును పూర్తిగా తనిఖీ చేశారు పోలీసులు, ఎన్నికల సిబ్బంది. తనిఖీలు పూర్తయిన తర్వాత... ఈటల రాజేందర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈటల రాజేందర్ వాహనం మాత్రమే కాదు.. నిన్న మంత్రి కేటీఆర్ వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తుండగా... మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు దగ్గర ఆయన కారును ఆపారు పోలీసులు. వాహనాన్ని తనిఖీ చేయాలని కోరగా... మంత్రి కేటీఆర్ కూడా సహకరించారు. కారు దిగి పక్కన నిల్చున్నారు. పోలీసులు.. ఎన్నికల సిబ్బంది.. తనిఖీలు పూర్తి చేసేవరకు వేచిచూశారు. తనిఖీలు పూర్తయిన తర్వాత కామారెడ్డి వెళ్లారు.
ఎన్నికల వేళ పోలీసులు చాలా స్ట్రిట్‌గా ఉన్నారు. నగదు, మద్యం తరలింపును అడ్డుకునేందుకు... పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న వాహన తనిఖీల్లో ఇప్పటికే పెద్దమొత్తంలో నగదు సీజ్ చేశారు. అలాగా పత్రాలు లేని బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్న ఉచితాలను కూడా సీజ్ చేశారు పోలీసులు, ఎన్నికల అధికారులు.