CM Revanth Reddy District Tour: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) శుక్రవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. సీఎం 2 రోజుల కేరళ పర్యటన గురువారంతో పూర్తైంది. శుక్రవారం మహబూబ్ నగర్ (Mahabubnagar)లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొని, అనంతరం కార్నర్ మీటింగ్ లో మాట్లాడతారు. సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే సభకి హాజరు కానున్నారు. ఈ నెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. అదే రోజు సాయంత్రం కర్ణాటకలో ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. 22న ఉదయం ఆదిలాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొననున్నారు. ఈ నెల 23న నాగర్ కర్నూల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్ లో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొంటారు.
'20 ఏళ్లు ప్రధానిగా రాహుల్'
సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల కేరళ పర్యటనలో భాగంగా.. వయనాడ్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభల్లో సీఎం పినరయి విజయన్ పై విమర్శలు గుప్పించారు. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని.. వచ్చే 20 ఏళ్లు రాహుల్ భారత ప్రధానిగా ఉంటారని అన్నారు. పినరయి విజయన్ కమ్యూనిస్టు నాయకుడు కాదని.. మోదీకి మద్దతు ఇచ్చే నాయకుడని విమర్శించారు. అటు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తోన్న అలప్పుజ పార్లమెంట్ సెగ్మెంట్ లోనూ రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేశారు.
ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ కు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. అటు తెలంగాణ వ్యాప్తంగా 50 సభలు, 15 రోడ్ షోలకు హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది. పలువురు అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా సీఎం రేవంత్ ర్యాలీలో పాల్గొనడమే కాకుండా.. బహిరంగ సభల్లోనూ ప్రసంగించనున్నారు. ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలోనూ కనీసం మూడు చోట్ల సీఎం సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.