KCR To Release BRS Manifesto:


హైదరాబాద్: తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఇటీవల ఈసీ విడుదల చేసింది. దాంతో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోపై ఫోకస్ చేశారు. ఇదివరకే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 15 (ఆదివారం) మధ్యాహ్నం 12.15 కు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. అదే రోజు అభ్యర్థులకు కేసీఆర్ బి ఫామ్ ఇవ్వనున్నారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా ఉంటుందని హరీష్ రావు, కేటీఆర్ లు చెప్పడంతో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజలతో పాటు విపక్షాలలోనూ ఉత్కంఠ నెలకొంది. 


గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ కి 5 రోజుల ముందు బీఆర్‌ఎస్‌ పార్టీ (అప్పటి టీఆర్ఎస్ పార్టీ) మేనిఫెస్టోను ప్రకటించింది. కానీ ఈసారి అభ్యర్థులను చాలా త్వరగానే ప్రకటించిన సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోతో మ్యాజిక్ చేయాలని భావిస్తున్నారు. 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా సీఎం కేసీఆర్ కొన్ని నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి 2018లోనే ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు.  


రైతు బంధు, రైతు భీమాపై ప్రకటనలు ఉంటాయని అన్నదాతలు భావిస్తున్నారు. గృహిణుల కోసం ప్రకటన ఉంటుందని మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆసరా పింఛన్ల పెంపు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాల అమలు వేగవంతం చేసే విధంగా కేసీఆర్ మరిన్ని వరాలు ప్రకటిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న కేసీఆర్.. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లతో ప్రత్యేకంగా సమావేశమై బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు తుది మెరుగులు దిద్దినట్లు సమాచారం. ప్రతిపక్షాల వ్యూహాలకు చెక్‌ పెట్టేలా, అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. 


తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌ గ్యారెంటీల కంటే గొప్పగా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ కూడా మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో రాబోతోందని ఇటీవల మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. మ్యానిఫెస్టోలో మహిళ ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టారని తెలిపారు. కొత్త మేనిఫెస్టోలో మహిళల ఆర్థిక బలోపేతం కోసం హామీలు ఉంటాయన్నారు. ఆ హామీలు ఏంటో కేసీఆర్ తెలుస్తుందని చెప్పారు. ఆ శుభవార్తను త్వరలోనే అందరూ వింటారని కూడా చెప్పారు మంత్రి హరీష్‌రావు.


16న సీఎం కేసీఆర్ సభ
అక్టోబర్ 16వ తేదీన జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. జనగామలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. జిల్లాకు సాగునీరు, తాగునీరు వచ్చిందన్నారు. జనగామ పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు.