Chandrababu: తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ సిద్దమవుతోంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే టీడీపీ ప్రకటించగా.. అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ ఎన్నికలపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. చంద్రబాబు కుటుంబసభ్యులు నారా లోకేష్, నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు కాసాని కూడా చంద్రబాబును కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబుతో కాసాని చర్చించారు.


తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, టీడీపీ కార్యాచరణను చంద్రబాబుకు కాసాని వివరించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఖారారు, ఎన్నికల వ్యూహంపై చంద్రబాబుతో మాట్లాడినట్లు సమాచారం. అలాగే తెలంగాణలో కూడా టీడీపీ, జనసేన పొత్తుపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కూడా టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దీనిని టీడీపీ, జనసేన నేతలెవ్వరూ ఖండించకపోగా.. పొత్తు ఉంటుందని సమర్థిస్తున్నారు. రాష్ట్రంలో కూడా టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని, త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో  సమావేశమవుతామని ఇటీవల కాసాని మీడియాకు వివరించారు. దీంతో తెలంగాణలో కూడా పొత్తు ఖాయమని తెలుస్తోంది.


తెలంగాణలో 30 స్థానాల్లో పోటీకి దిగబోతున్నట్లు ఇప్పటికే పవన్ ప్రకటించారు. పొత్తులో భాగంగానే పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణలో రెండు పార్టీల పొత్తు వల్ల సెటిలర్ల ఓట్లు చీలవని టీడీపీ, జనసేన అభిప్రాయపడుతుంది. దీని వల్ల ఎంతో కోంత లాభం ఉంటుందని భావిస్తున్నాయి. చంద్రబాబుతో పొత్తుపై కాసాని చర్చించగా.. రేపో, మాపో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబుతో ములాఖత్ కొనసాగుతోంది. ముగిసిన తర్వాత లోకేష్, భువనేశ్వరి మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


అటు చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు ఒక రిపోర్ట్‌ను జైలు అధికారులకు అందించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యలతో పాటు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. చర్మంపై దద్దుర్లు వచ్చినట్లు తెలిపారు. అయితే చంద్రబాబుకు హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి సమస్య ఉందని, ఈ సమస్య వల్ల డీహైడ్రేషన్‌తో గుండెపైనా ప్రభావం పడే అవకాశముందని వ్యక్తిగత వైద్యులు చెబుతున్నారు. జైలు అధికారుల మాత్రం అంతా బాగుందని చెబుతున్నారని, అధికారులు చెప్పిన దానికి భిన్నంగా వైద్యుల నివేదిక ఉందని వ్యక్తిగత వైద్యులు అంటున్నారు.


ఇక చంద్రబాబు ఆరోగ్య సమస్యలను చిన్నవిచేసి అధికారులు చూపిస్తున్నారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తాజా నివేదికతో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, శ్రేణుల్లో మరింత ఆందోళన పెరిగిందని అంటున్నారు. చంద్రబాబుకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని డిమాండ్ చేస్తోన్నారు. దీంతో చంద్రబాబును రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జీజీహెచ్ ఆస్పత్రిలో ప్రత్యేక వీవీఐపీ రూమ్‌ను కూడా సిద్దం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం రాత్రి గదిని శుభ్రం చేసినట్లు చెబుతున్నారు. రేపో, మాపో బాబును ఆస్పత్రికి తరలించే అవకాశముంనది అంటున్నారు.