Contesting Candidates In Telangana Loksabha Elections: తెలంగాణ లోక్ సభ ఎన్నికల (Telangana Loksabha Elections) బరిలో మొత్తం 525 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్ రాజ్ (Vikas Raj) తెలిపారు. హైదరాబాద్ (Hyderabad)లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిందని.. సికింద్రాబాద్ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం 285 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారని వెల్లడించారు. అభ్యర్థుల సంఖ్య దృష్ట్యా 7 స్థానాల్లో 3 ఈవీఎంలు, 9 స్థానాల్లో 2 ఈవీఎంలు ఉపయోగించనున్నట్లు చెప్పారు. శుక్రవారం నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 3,986 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఎన్నికల విధుల్లో 2.94 లక్షల మంది
ఎన్నికల విధుల్లో 2.94 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. అన్ని చోట్లా ఓటర్ స్లిప్పుల పంపిణీ జరుగుతోందని.. పోస్టల్ బ్యాలెట్ జిల్లాల్లో ప్రింట్ చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల విధులకు 155 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని వివరించారు. ఎన్నికల ఫిర్యాదులకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1950 ఏర్పాటు చేశామని.. దీని ద్వారా 1,227 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 15 వేలకు పైగా సర్వీస్ ఓటర్లు ఉన్నారని.. 35,809 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. 192 పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చినట్లు వెల్లడించారు.
ఏపీలో ఎంతమందంటే.?
అటు, ఏపీలోనూ సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత లోక్ సభ ఎన్నికల బరిలో 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది బరిలో ఉన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా ఆరుగురు పోటీలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అసెంబ్లీకి సంబంధించి 318 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్ సహా 27 మంది బరిలో ఉన్నట్లు ఈసీ తెలిపింది. కుప్పం నుంచి చంద్రబాబు సహా 13 మంది, మంగళగిరిలో నారా లోకేశ్ సహా 40 మంది ఎన్నికల బరిలో నిలిచారు. అటు, పిఠాపురం అసెంబ్లీ బరిలో జనసేనాని పవన్ కల్యాణ్ సహా 13 మంది పోటీ చేస్తున్నారు. ఇక లోక్ సభ ఎన్నికల విషయానికొస్తే మొత్తం 454 మంది అభ్యర్థులు బరిలో నిలవగా కడప లోక్ సభకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సహా 14 మంది బరిలో నిలిచారు. అలాగే, నంద్యాలలో 31, గుంటూరులో 30 మంది పోటీలో ఉన్నారు. కాగా, ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు మునిగి తేలుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మే 13న పోలింగ్ జరగనుంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్రమ నగదు, మద్యం సరఫరా అరికట్టేలా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.