Election Commission Clarity To High Court On Janasena Glass Symbol: స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై జనసేన హైకోర్టును (Ap Highcourt) ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. జనసేన (Janasena) పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలు, అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఇతరులకు ఆ గుర్తు కేటాయించబోమని ఈసీ స్పష్టం చేసింది. 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తును ఎంపీ అభ్యర్థులకు ఇవ్వబోమని తెలిపింది. అలాగే, జనసేన పోటీ చేస్తోన్న 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో పోటీ చేస్తోన్నఅసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించమని కోర్టుకు నివేదించింది. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఇలా చేస్తామని ఈసీ పేర్కొంది. దీంతో.. జనసేనకు ఇబ్బందులు తొలగుతాయని అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. 


'మీకు అభ్యంతరాలు ఉంటే..'


అయితే, తాము పోటీ చేసే స్థానాల్లో మాత్రమే కాకుండా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాస్ గుర్తును వేరే వారికి కేటాయించవద్దని జనసేన ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. కానీ, గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ లో ఈసీ పెట్టిన నేపథ్యంలో అలా అన్ని చోట్ల ఇవ్వడం ఎలా సాధ్యమని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈసీ నివేదిక మేరకు జనసేన పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై  ఏమైనా అభ్యంతరాలు ఉంటే వేరే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో జనసేనకు ఈ అంశంపై ఊరట లభించనట్లయింది.


ఇదీ జరిగింది


కాగా, గాజు గ్లాస్ సింబల్ ను ఈసీ ఫ్రీ సింబల్  జాబితాలో చేర్చడం జనసేన పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో కొందరు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోగా దీనిపై జనసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పిటిషన్ లో కోరారు. 'ఫ్రీ సింబల్' నుంచి గాజు గ్లాస్ గుర్తును తొలగించాలని ఈసీకి వినతిపత్రం ఇచ్చామని.. ఆ పార్టీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెండోసారి కూడా వినతిపత్రం ఇచ్చినా.. ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనతో పొత్తులో ఉన్న కారణంగా.. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తే కూటమికి నష్టం కలుగుతుందని వివరించారు. 'జనసేన 2 ప్రధాన పార్టీలతో ఎన్డీయే పొత్తులో ఉంది. అందుకే మేం అన్ని చోట్లా కాకుండా కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగాం. మిగిలిన చోట్ల పొత్తులో ఉన్న వేరే పార్టీల అభ్యర్థులు గెలుపునకు ప్రచారం చేస్తున్నాం. ఈ టైంలో గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు ఇస్తే ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది.' అని కోర్టుకు వివరించారు. దీనిపై ఈసీ హైకోర్టుకు బుధవారం వివరణ ఇవ్వగా.. విచారణ ముగిస్తూ నిర్ణయం తీసుకుంది.


Also Read: Cm Jagan: 'సీఎం జగన్ గారూ వీటికి సమాధానం చెప్పండి' - వైఎస్ షర్మిల బహిరంగ లేఖ