Telangana Assembly Election Counting: మరికొన్ని గంటల్లో తెలగాణ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. రేపు (ఆదివారం) ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభకానుండగా... రేపు  (ఆదివారం) ఉదయం 10గంటల కల్లా తొలి ఫలితం వచ్చేస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. కౌంటింగ్‌ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి  చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసుకోవాలని ఆతృత  పడుతున్నారు.


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయని చెప్పిన వికాస్‌రాజు... ఈవీఎంలను పార్టీ ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్‌రూంలకు తరలించామన్నారు. ప్రస్తుతం జిల్లా  కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచామని చెప్పారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భారీ భద్రత ఉంది. ఈవీఎంలు భద్రపరిచిన గదుల దగ్గరకు ఎవరినీ  అనుమతించడం లేదు. స్ట్రాంగ్‌ రూంల దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. డీసీపీ స్థాయి అధికారి ఇద్దరు సీఐలు, నలుగులు ఎస్‌ఐలతో పాటు కేంద్ర బలగాలు స్ట్రాంగ్‌  రూముల దగ్గర పహారా కాస్తున్నాయి. మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల దగ్గర బందోబస్తు విధుల్లో ఉంచారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు  రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోనే ఉంటుంది. 


తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బంధీ ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో  హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు పెట్టారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో చేపడుతున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే... రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు అధికారులు. 


కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ కోసం మొత్తం 17వందల 66 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 పోలింగ్‌ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్‌, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. ఒక్కో టేబుల్‌ దగ్గర మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను కేటాయించారు. చిన్న నియోజకవర్గంలో ఉదయం 10గంటలకల్లా ఫలితం వెలువడే అవకాశం ఉంది. 


ఇక, పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్‌ చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా  జరుగుతుందని చెప్పారు వికాస్‌రాజ్‌. లక్షా 80వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల బరిలో 2వేల 290 మంది  అభ్యర్థులు ఉండగా... వీరిలో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌. తెలంగాణలో మొత్తం 71.06 శాతం పోలింగ్ జరిగిందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌. మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం పోలింగ్ నమోదు కాగా.. యాకుత్‌పురాలో అత్యల్పంగా 39.6శాతం పోలింగ్ నమోదైనట్లు వికాస్ తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే మూడు శాతం పోలింగ్‌ తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు సీఈవో వికాస్‌రాజ్‌.