కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ డబుల్ హ్యాట్రిక్ కన్నేస్తే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నాలుగోసారి విజయం సాధించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలకు అబ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్‌. మధిర నియెజకవర్గంలో కాంగ్రెస్‌ తరపున సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, బీఆర్ఎస్‌ తరపున లింగాల కమల్‌రాజ్ పోటీ పడుతున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. నాలుగోసారి అదే నియోజకవర్గం నుంచి  మల్లు భట్టి విక్రమార్క బరిలోకి దిగారు. భద్రాచలం నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్య హస్తం పార్టీ నుంచి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్‌ తరపున బరిలోకి దిగుతున్నారు. పొదెం వీరయ్య 1999, 2004 ములుగు నుంచి, 2018లో కాంగ్రెస్‌ తరపున గెలుపొందారు. 


నల్గొండలో ఎమ్మెల్యే కంచర్ల వర్సెస్ ఎంపీ కోమటిరెడ్డి
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 సీట్లకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించింది.  నల్గొండలో కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డి ఢీ కొట్టబోతున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 1999, 2004, 2014 ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా...పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపొందారు. నకిరేకల్‌ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి వేముల వీరేశం, బీఆర్ఎస్‌ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ పోటీ చేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో గ్యాదరి కిశోర్ గెలుపొందారు. ఆలేరు నియోజకవర్గంలో హస్తం పార్టీ నుంచి బీర్ల ఐలయ్య, అధికార పార్టీ తరపున గొంగిడి సునీత బరిలోకి దిగుతున్నారు. గొంగిడి సునీతారెడ్డి 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. 


ఐదుసార్లు గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్‌ నగర్‌లో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని సిట్టింగ్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీఆర్ఎస్‌ తరపున ఢీకొట్టబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఎస్‌ కేబినెట్‌లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. 1999, 2004 కోదాడ నుంచి, హుజుర్ నగర్‌ నుంచి 2009, 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాగార్జున సాగర్‌ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు జయవీర్‌ కాంగ్రెస్‌ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భరత్ బీఆర్ఎస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. జానారెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇద్దరు కొడుకులు తరఖాస్తు చేసుకున్నా, జైవీర్ కు మాత్రమే కాంగ్రెస్ సీటు కేటాయించింది. కోదాడ స్థానంలో కాంగ్రెస్‌ తరపున పద్మావతి రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ తలపడుతున్నారు.


కడియం ఈసారైనా గెలుస్తారా ? 
ఉమ్మడి  వరంగల్ జిల్లాలో  స్టేషన్‌ ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ నుంచి సింగాపురం ఇందిర, బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి తలపడుత్నారు. నర్సంపేట స్థానంలో దొంతి మాధవ్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి, పెద్ది సుదర్శన్‌రెడ్డి బీఆర్ఎస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. భూపాలపల్లిలో కాంగ్రెస్‌ నుంచి గండ్ర సత్యనారాయణ రావు, అధికార పార్టీ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి బరిలోకి దిగారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గండ్ర, బీఆర్ఎస్ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి పై గెలుపొందాడు. 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి  సిరికొండ మధుసూదనాచారి చేతిలో 7,216 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మధుసూదనాచారిపై గెలుపొందాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ములుగులో కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క, బీఆర్ఎస్‌ నుంచి నాగజ్యోతి పోటీ చేస్తున్నారు. 2009, 2018 ఎన్నికల్లో అనుసూయ గెలుపొందారు.