తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయ్. రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయ్. గులాబీ బాస్ ఒకే సారి 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి...ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. కమలం పార్టీ అయితే ఇంకా ఏ నియోజకవర్గానికి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు. ఇంకా అభ్యర్థుల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూపులు చూస్తోంది.
రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తండ్రులకు బదులకు వారసులకు టికెట్లు కేటాయించేందుకు మొగ్గుచూపుతున్నాయ్. కొందరు వయసు మీద పడటంతో ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు నేతలు మాత్రం తాము లైమ్ లైట్ లో ఉన్నపుడే వారసులను అసెంబ్లీకి పంపాలని వ్యూహాలు రచిస్తున్నారు. అందుకోసం తమకు సీట్లు ఇచ్చే పార్టీలకే జైకొడుతున్నారు. అధికార పార్టీకి దూరం కావడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తన కుమారుడు డాక్టర్ సంజయ్‌కు సీటు ఇవ్వాలని కేసీఆర్ కు విన్నవించడంతో సానుకూలంగా స్పందించారు. దీంతో విద్యాసాగర్ కు బదులు డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు. అదే పార్టీ నుంచి నాగార్జున సాగర్ నుంచి ఉపఎన్నికల్లో గెలుపొందిన భరత్ ఈ ఎన్నికల్లోనూ సీటు సంపాదించారు. నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో భరత్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. కంటోన్ మెంట్ ఎమ్మెల్యే సాయన్న కొంతకాలం క్రితం మరణించారు. దీంతో ఆ సీటును కుమార్తె లాస్య నందితకు ఇచ్చారు కేసీఆర్.
అధికార పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రెండు సీట్లు ఆశించారు. కేసీఆర్ మాత్రం మైనంపల్లికి మాత్రమే సీటిచ్చారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోతున్న మైనంపల్లి, కుమారుడు రోహిత్ భవిష్యత్ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనకు, తన కుమారుడికి సీట్లు ఇచ్చే పార్టీకే జైకొడతానని ఇప్పటికే ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుదీర్ఘకాలంపాటు మంత్రిగా పని చేసిన జానారెడ్డి తనయుడు జయవీర్ నాగార్జున సాగర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గురువారం గాంధీభవన్ లో సీటు కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు...ఎవరెవరి వారసులకు టికెట్లు ఇవ్వడంపై...ఇంకా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. పార్టీ అంతర్గత సర్వేలు చేయించిన తర్వాత టికెట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చాయ్.