తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల కానుంది. మొదటి వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్రం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ నెల ముందే అభ్యర్థులను ప్రకటిస్తే, కాంగ్రెస్, బీజేపీలు వడపోత కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ జాబితా రెండు మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సీట్లు దక్కించుకున్న నేతలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి, ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మూడోసారి కేసీఆర్ నాయకత్వానికి బలపర్చాలని ప్రజలను కోరుతున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. 


గత నెల 21న 119 అసెంబ్లీ స్థానాల్లో 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు సీఎం కేసీఆర్. నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్ పెట్టారు. గతంలో పెండింగ్ లో పెట్టిన జనగామ, నర్సాపూర్, గోషామహల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లను కేసీఆర్‌ ఖరారు చేశారు. వారు క్షేత్ర స్థాయిలో పని చేసుకునేందుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. జనగామ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ స్థానానికి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, గోషామహల్ నియోజకవర్గానికి నందకిషోర్‌ వ్యాస్‌ బిలాల్‌ పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. నాంపల్లి నియోజకవర్గం అభ్యర్థి విషయంలో కసరత్తు కూడా ఒకటి రెండు రోజుల్లో కొలిక్కిరానుంది.  


మల్కాజిగిరిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకే మరోసారి అవకాశం ఇచ్చింది. అయితే ఆయన రెండు సీట్లు డిమాండ్ చేయడంతో , బీఆర్ఎస్ నిరాకరించింది. దీంతో ఆయన గురువారం మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మల్కాజిగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో అక్కడ కొత్త అభ్యర్థికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి క్షేత్రస్థాయిలో పని చేసుకోవాలని గులాబీ బాస్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పెండింగ్‌ అభ్యర్థులతో త్వరలోనే రెండో జాబితాను ప్రకటించే అవకాశముంది.


గతంలో ప్రకటించిన తొలి జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేపీల్లోని కీలక అసమ్మతి నేతలను ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌ గూటికి చేర్చే వ్యూహానికి పార్టీ అధినేత కేసీఆర్‌ పదును పెడుతున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం అత్యంత సహజమని చెప్తూనే అసంతృప్తులకు కళ్లెం వేసేందుకు బీఆర్‌ఎస్‌ మరింత ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, బెల్లంపల్లికి చెందిన ప్రవీణ్‌, జహీరాబాద్‌ నేత నరోత్తమ్‌, కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన గోలి శ్రీనివాస్‌రెడ్డి, దుబ్బాక నేత బక్కి వెంకటయ్యలకు ఇటీవల ప్రభుత్వ పదవులను కట్టబెట్టారు సీఎం కేసీఆర్.  టికెట్‌ ఆశించి భంగపడిన పలువురు ముఖ్య నేతలకు సర్ది చెప్పేందుకు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు దారిలోకి వస్తున్నా, మరికొందరు మాత్రం బుజ్జగింపులకు తలొగ్గడం లేదు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండటంతో, ఆయా పార్టీల టికెట్‌ ఆశిస్తూ బీఆర్‌ఎస్‌ను వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.