Telangana Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా క్యాంపెయిన్ చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా గ్రామాలను చుట్టేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్‌ (Asifabad) జిల్లా కాగజ్‌నగర్‌ (Kagaz Nagar )లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక విజయ బస్తీలో బహుజన్ సమాజ్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. అదే సమయంలో బీఆర్ఎస్ (Brs) ప్రచారం వాహనం భారీ సౌండ్ తో అక్కడికి వచ్చింది. పాటల సౌండ్ తగ్గించాలని బీఎస్పీ  (Bsp) కార్యకర్తలు అధికార పార్టీ నేతలను కోరారు. బీఎస్పీ నేతలు చెప్పినా పట్టించుకోకపోవడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగజ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ (RS Praveen Kumar) బైఠాయించి నిరసన తెలిపారు. గులాబీ పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.