తెలంగాణలో దూకుడు మీదున్న కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనమని  అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. 


నకిరేకల్ సీటు ఆశించినా...
ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ 55 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 12 సీట్లను బీసీలకు కేటాయించింది. తొలి జాబితాలో చెరుకు సుధాకర్ పేరు లేదు. దీంతో ఆయన మనస్థాపం చెందారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన ఏ పార్టీలో చేరనున్నదీ క్లారిటీ ఇవ్వలేదు. రెండు మూడు రోజులుగా ఆయనను బీఆర్ఎస్‌లో చేర్చుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చెరకు సుధాకర్‌తో ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డిలు చర్చలు జరిపారని, శని, ఆది వారాల్లో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.


కాంగ్రెస్ లో భూస్వామ్య పోకడలు
ప్రజల తెలంగాణ కోసం కాంగ్రెస్‌, దొరల తెలంగాణ కోసం బీఆర్‌ఎస్ అని  చెబుతున్నప్పటికీ అంతర్గతంగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న భూస్వామ్య పోకడలు పోలేదన్నారు. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు భూస్వామ్య పోడకలకు అద్దం పడుతున్నాయన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చి గౌరవం ఇచ్చినప్పటికీ నల్లగొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విపరీత ధోరణిత వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నిలువరించడంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి కూడా ఈ ప్రయత్నం చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మెరుగ్గా ఉన్న రాజకీయ వేదిక వెతుకులాట కోసం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. 


కోమటిరెడ్డి హేళనగా మాట్లాడారు
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీలకు 12 సీట్లు ఇచ్చామంటూ వెక్కిరించినట్లు మాట్లాడారని డాక్టర్ చెరుకు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా ఉద్దేశించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన తీరు యావత్‌ తెలంగాణ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. తనతో కలిసి ప్రయాణించిన వారికి లేఖలో కృతజ్ఞతలు చెప్పారు.  ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారింది. ఎప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పార్టీని వీడుతారో తెలియని అయోమయం నెలకొందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.


బయటకు వెళ్లేలా పార్టీనే...
ఎన్నికల్లో గెలుపు గుర్రాల పేరుతో నందికంటి శ్రీధర్ సహా ఎంతో మంది బయటకు వెళ్లే కాంగ్రెస్ పార్టీనే కల్పించిందన్నారు చెరుకు సుధాకర్. రాహుల్ గాంధీ నిత్యం పార్లమెంట్ లో ఓబీసీల రిజర్వేషన్ల గురించి, మహిళా రిజర్వేషన్ల గురించి, కులగణణ గురించి మాట్లాడుతుంటే, తెలంగాణలో పచ్చి ఆధిపత్య కులాల రాజకీయ కంపు మమ్మల్ని ఊపిరాడకుండా చేస్తోందని లేఖలో ప్రస్తావించారు చెరుకు సుధాకర్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత పెంచుతూ, మరోవైపు మధుయాష్కీకి ప్రాధాన్యత తగ్గిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు బడుగు బలహీన వర్గాల మనోభావాల్ని గుర్తించడంలో విఫలమైతే రాహుల్ గాంధీ శ్రమ నిరూపయోగం అవుతుందని హెచ్చరించారు.