Telangana Assembly Election 2023:


హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్రనేతల పర్యటనలు, ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. హమీలు, మ్యానిఫెస్టోలు, భరోసా, గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. గులాబీ పార్టీతో పాటు కాంగ్రెస్ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ కూడా ప్రచారంలో దూకుడు పెంచేందుకు రెడీ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ గర్జన సభలో మాట్లాడనున్నారు. 


బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారా ?


సాయంత్రం 5.30 గంటలకు ఎల్‌బీ స్టేడియంలో ఈ సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రధాని మోడీ ప్రకటిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునేలా హామీలు ఇచ్చే అవకాశం ఉందని పార్టీలు చెబుతున్నాయి. బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం ద్వారా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఇరకాటంలోకి నెట్టాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో బాగంగానే బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.


బీసీల ఓట్లే లక్ష్యమా ?
ఎవరు సీఎం అవుతారని ముందే ప్రకటించే ఆనవాయితీ కాషాయ పార్టీలో ఎన్నడూ లేదు. తెలంగాణ జనాభాలో 54శాతం ఉన్న బీసీలను ఆకట్టుకునేందుకు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో ఇప్పటి వరకు బీసీ వర్గానికి చెందిన వారెవరూ ముఖ్యమంత్రి కాలేదని, అందుకే బీసీ ఎజెండా, బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకున్నట్లు తెలుస్తోంది. బీసీ ఎజెండా ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని బీజేపీ హైకమాండ్ లెక్కలు వేసుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా మారిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా ప్రధాని మోడీ ప్రకటన చేసే అవకాశము లేకపోలేదంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎస్టీల రిజర్వేషన్లను 10–12 శాతానికి పెంచుతామని హామీ ఇవ్వొచ్చని అంటున్నారు. తెలంగాణలో విజయం సాధించి, దక్షిణాదిన సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది.


గంటన్నర పాటు నగరంలో పర్యటన 
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5.30 గంటలకు ఎల్‌బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని మోడీ పర్యటించనున్న ప్రాంతాల్లో పోలీసుల పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రోడ్లను ఇప్పటికే జల్లెడ పట్టేశారు. ఎల్బీ స్టేడియం పోలీసులు భారీగా మోహరించారు.