Payyavula Keshav: పయ్యావుల కేశవ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ పేరు సుపరిచితం. తెలుగుదేశం పార్టీ (TDP)అధినేత చంద్రబాబు నాయుడుకి నమ్మిన బంటు. పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా కీలక విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలించి చక్కబెడుతూ అధినేత చంద్రబాబుకు సహాయకుడిగా ఉంటారు. అలాంటి నేతకు ఒక విచిత్రమైన సెంటిమెంట్ చిరాకు తెప్పిస్తోంది. 



ఉరవకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి... నియోజకవర్గంలో ఎదురెలేని రారాజు. గత మూడు దశాబ్దాలుగా ఉరవకొండ నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కొనసాగుతూ వస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు ఏ నియోజకవర్గానికైనా పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడానికి ఆ పార్టీ అధినేతలకు అప్లికేషన్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఊరవకొండ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీలో పయ్యావుల కేశవుని కాదని మరొకరు అప్లికేషన్ వేయడానికి కూడా సాహసించరు. 



అలాంటి నేతకు నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్ చిరాకు పుట్టిస్తుంది. అదేనండి ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ఓడిపోతేనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ నేటికీ కొనసాగుతూనే వస్తుంది. ఈసారి ఆ సెంటిమెంట్ బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించాలని చూస్తున్నారు. 30 ఏళ్లుగా ఆయన గెలిచిన ప్రతి సారీ పార్టీ అధికారానికి దూరమవుతోంది. ఆయన ఓడినపోయిన ప్రతిసారీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. 



పయ్యావుల కేశవ్ మొదటిసారి 1994లో పోటీ చేశారు. ఆ ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో ఓడిపోయారు. అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2004, 2009, 2019లో పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ మూడు దఫాలుగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. 1994 మినహా ప్రతి ఎన్నికల్లో కూడా ఇదే సెంటిమెంట్‌ పయ్యావులను చికాకు పెడతోంది. 



30 ఏళ్ల క్రితం సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని అంటున్నారు పయ్యావుల కేశవ్. కచ్చితంగా ఈసారి విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు. అంతే కాదు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ప్రతి సభలో చెబుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాగళంలో కూడా పయ్యావుల ఈ విషయాన్ని ప్రస్తావించారు. 



2024లో టీడీపి కూటమి అధికారంలోకి వస్తుంది ఉరవకొండ ఎమ్మెల్యేగా నేనే గెలుస్తా: పయ్యావుల
2024 ఎన్నికల్లో ఉరవకొండ శాసనసభ్యునిగా గెలిచి తీరుతానని రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నారు. 2024లో టిడిపి అధికారంలోకి వస్తుంది ఉరవకొండ ఎమ్మెల్యేగా నేనే గెలుస్తా అంటూ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తేల్చి చెప్పారు. ప్రచారం కూడా అంతే స్థాయిలో చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పయ్యావుల కేశవ్ మాత్రమే నియోజకవర్గవ్యాప్తంగా ప్రచారం నిర్వహించేవారు. ప్రస్తుతం 1994 సీన్ రిపీట్ చేయాలని దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మరో అడుగు ముందుకేశారు. ఈసారి  ఎన్నికల ప్రచారంలోకి తన ఇద్దరు కుమారులు విక్రమ్ సింహ, విజయ్ సింహను ప్రచార బరిలోకి తీసుకువచ్చారు. 



ఎన్నికల పోలింగ్ నాటికి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తన ఇద్దరు కుమారులు నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా పయ్యావుల కేశవ్ తన కుమారులు ఇద్దరు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, చంద్రబాబు సూపర్ పిక్స్ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈసారి కచ్చితంగా తన తండ్రిని, పార్టీని నియోజకవర్గంలో గెలిపించాలన్న కసితో వీళ్లిద్దరు ప్రచారం చేస్తున్నారు. ఓ వైపు పయ్యావుల కీలకమైన ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ విజయం కోసం ప్రయత్నిస్తుంటే... ఆయన కుమారులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.