Supreme Court Rejects Ysrcp Postal Ballot Petition: ఎన్నికల కౌంటింగ్ వేళ వైసీపీకి సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ అంశానికి సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నియమాలపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా, పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) ఓటర్ డిక్లరేషన్‌కు సంబంధించి 'ఫాం - 13ఏ'పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర (సీల్) లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటవుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వైసీపీ (Ysrcp) ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్‌లో కోరింది. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం వైసీపీ వాదనలను తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు సీల్ చేయకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉందన్న ఎన్నికల సంఘం ఆదేశాలను సమర్థించింది. పిటిషనర్‌కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలన్న ఈసీ తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ జూన్ 1న తీర్పు వెలువరించింది.
సుప్రీంలో సవాల్
అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆదివారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో వైసీపీ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అటు, ఇదే అంశంపై విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏదైనా ఉత్తర్వులు జారీ చేసే ముందు న్యాయస్థానం తన వాదనలు సైతం వినాలని పిటిషన్ ఫైల్ చేశారు.