AP Election Violence :  ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. ఈ బృందానికి వినీత్ బ్రిజ్ లాల్ నాయకత్వం వహిస్తారు.  మొత్తం 13 మంది సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేసింది.  పలువురు డీఎస్పీలు, సీఐలు ఉన్నారు.  అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు  బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది. ఈ సిట్ రెండు రోజుల్లో కీలక చర్యలు తీసుకుని నివేదికను ఈసీకి సమర్పించే అవకాశం ఉంది.  పోలింగ్ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన హింస నాలుగు రోజుల పాటు కొనసాగింది.  మాచర్ల, నరసరావుపేట, పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతిల్లో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.                                                    


ఈ అల్లర్ల కేసులన్నింటినీ సిట్  పూర్తి స్థాయిలో విచారించనున్నది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లను కూడా సిట్ పరిశీలించి అదనపు సెక్షన్లు చేర్చనుంది. ఘర్షణలకు సంబంధించి కుట్రలో పాలు పంచుకున్న కొంత మంది సీనియర్ రాజకీయ నేతల్ని కూడా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా చేస్తారన్న సమాచారం ఉండటంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో  పాటు ఘర్షణల్లో నేరుగా పాల్గొని దాడులు చేసిన ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఆజ్ఞాతంలోకి వెళ్లారు. వాస్తవానికి వీరిని హౌస్ అరెస్టులో ఉంచారు. అయినా  వీరు ఆజ్ఞాతంలోకి వెళ్లడంతో  పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.                           


మరో వైపు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా  ఎన్నికలు జరిగిన తరువాత చెలరేగిన హింసాత్మక సంఘటనలపై  ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపినట్లు  తెలుసతోంది.  నరసరావుపేట, పల్నాడు, చంద్రగిరి, మాచర్, తాడిపత్రి, తిరుపతిలో చోటు చేసుకున్న సంఘటనలపై రాష్ట్ర ఈసీ ఆఫీస్, కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపినట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా చేసిన ఘర్షణలు.. ఈసీ వైఫల్యం అనేలా చేస్తున్న ఆరోపణలను కూడా నివేదికలో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.                                       


మరో వైపు పలు ఘటనల్లో పోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యం కనిపించడంతో ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారుల్ని సస్పెండ్ చేశారు.  మరికొంత మందిని  బదిలీ చేశారు. పలువురు దిగువస్థాయి పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఇప్పటికే కౌంటింగ్ అనంతర హింస ఎక్కువగా ఉంటుందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో పెద్ద  ఎత్తున బలగాలను ఏపీకి తరలిస్తున్నారు.