Elections 2024 : పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవల్లో ప్రధాన పాత్ర వెంకటరామిరెడ్డిదేనని పోలీసులు గుర్తించారు. రణ చింతల మండలం రెంటాల.. కారంపొడి లో జరిగిన గొడవల్లో వెంకటరామిరెడ్డి పాత్ర ఉందని సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. వెంకటరామిరెడ్డి కి ఇద్దరు గన్ మెన్‌లు ఉన్నారు. ఇద్దరు గన్ మేన్ లు ఎస్పీ ఆఫీసులో రిపోర్టు చేశారు. తమకు తెలియకుండా .. చెప్పకుండా వెంకటరామిరెడ్డి వెళ్లిపోయారని.. కాంటాక్ట్ లో లేరని వారు ఎస్పీ ఆఫీసులో చెప్పారు.
మొత్తం పదమూడు హంసాత్మక ఘటనలు
మాచర్ల నియోజకవర్గం పరిధిలో ఎన్నికల రోజు.. ఆ తరువాత మొత్తం 13 హింసాత్మక సంఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు. వీటిలో వైసిపి వాళ్లు చేసిన దాడులపై 7 వరకు కేసు నమోదు చేసినట్లుగాతెలుస్తోంది. హత్యా ప్రయత్నం.. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు రేంజ్ ఐజి త్రిపాఠి మాచర్లలో ఉండి కేసుల దర్యాప్తును పరిశీలిస్తున్నారు. పోలింగ్ తర్వాతి రోజు 14వ తేదీ జరిగిన కారంపూడిలో టీడీపీ కార్యాలయం. టీడీపీ నేతలపై దాడుల్లో నిందితులుగా పిన్నెల్లి సోదరులను చేర్చాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే పిన్నెల్లి సోదరులు ఆజ్ఞాతంలోకి వెళ్లారని చెబుతున్నారు.
వీడియో సాక్ష్యాలు వెలుగులోకి తెస్తున్న పోలీసులు
13, 14 తేదీల్లో జరిగిన గొడవలకు సంబంధించి సీసీ ఫుటేజీ.. వివిధ ఛానల్స్ లో ప్రసారమైన వీడియోలోని లింకులను పోలీసులు పరిశీలిస్తున్నారు. వివిధ మీడియా ఛానల్స్ కి ఫోన్ చేసి ఆధారాలు ఇవ్వాలని కోరుతున్నారు. దాడులపై వీడియో సాక్ష్యాలు ఉండటంతో ప్రత్యక్షంగా పాల్గొన్న వారందర్నీ అరెస్టు చేయడం ఖాయమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలకు లెక్కే లేదు. ఒక్కరు కూడా నామినేషన్లు వేయలేకపోయారు. మాచర్ల మున్సిపాలిటీ మొత్తం ఏకగ్రీవం అయింది. జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి.
తక్షణం చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలన్న ఈసీ
మాచర్లలో పోలింగ్ అనంతర హింసపై ఈసీ తీవ్ర ఆగ్రగహంతో పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేసింది. హింసకు కారణం అయిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని అరెస్టు చేసి ఈసీకి చెప్పాలనుకున్నారు కానీ.. ఎమ్మెల్యే సోదరిలిద్దరూ ఆజ్ఞాతంలోకి పోవడం చర్చనీయాంశంగా మారింది. అరెస్టు చేస్తారని వీరికి ముందుగా సమాచారం రావడంతోనే వెళ్లిపోయారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.