Shankhabrata Bagchi As Ap Incharge DGP: ఏపీ ఇంఛార్జీ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీ (IPS Shankhabrata Bagchi) నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. డీజీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కాగా, డీజీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం ఆదివారం వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. డీజీపీ పోస్టు కోసం సోమవారం ఉదయం 11 గంటలలోపు ముగ్గురు డీజీ ర్యాంక్ స్థాయి అధికారుల జాబితాను పంపించాలని ఆదేశాలు ఇచ్చింది. గత ఐదేళ్లలో వారి ఏపీఏఆర్ గ్రేడింగ్, విజిలెన్స్ క్లియరెన్స్ ల వివరాలను ప్యానెల్ తో పాటు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి నిర్దేశించింది. సీఎస్ పంపిన జాబితాలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనుంది.


ప్రతిపక్షాల ఆరోపణలతో..


ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజేంద్రనాథరెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచారనే విమర్శలు ఉన్నాయి. అంతా గమనించేలా ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టీకాలు జరుగుతున్నా ఏ రోజూ పట్టించుకోలేదని ఆయా పార్టీల నేతల ఆరోపించారు. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా ఆయన అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు తమ న్యాయపరమైన హక్కుల సాధన కోసం నిరసనకు పిలుపునిచ్చినా అణగదొక్కడంపై విమర్శలున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతే ఆయన ప్రతిపక్షాలకు అపాయింట్ మెంట్ ఇస్తున్నారనే ప్రచారం సాగింది. ఆయన డీజీపీగా ఉంటే ఎన్నికలు పారదర్శకంగా జరగవని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ఫిర్యాదులతో విచారణ చేసిన ఈసీ.. డీజీపీపై బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికల పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించొద్దని ఆదేశించింది.


కొత్త డీజీపీగా తిరుమలరావుకు ఛాన్స్!


రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు నేపథ్యంలో ఇప్పుడు కొత్త డీజీపీగా ఎవరిని నియమిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. 1990వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం సీనియార్టీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానాల్లో రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్, 1990వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా, 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. కొత్త డీజీపీ రేసులో ఈ ముగ్గురూ ఉండగా.. ప్యానల్ వీరి పేర్లను పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ, ఎన్నికల సంఘం వీరి ముగ్గురిలోనూ ఎవరినైనా వద్దనుకుంటే.. హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా పేరును ఆ జాబితాలో చేర్చే అవకాశం ఉంది.


Also Read: Andhra Pradesh News: పవన్ తరఫున సాయి ధరమ్‌ తేజ్‌ ప్రచారం- రాళ్లు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు- తాటిపర్తిలో ఉద్రిక్తత