Andhra Pradesh News: అనంతపురం, 5 ఏప్రిల్ 2024: ధర్మవరం నియోజకవర్గం(Dharmavaram assembly constituency) లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. వైసీపీ (YSRCP) తరఫున ఇక్కడ కేతిరెడ్డి వెంకట్‌రామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) పోటీ చేస్తుంటే కూటమి తరఫున బీజేపీ లీడర్‌ సత్యకుమార్(Satya Kumar) బరిలో ఉన్నారు. గుడ్‌మార్నింగ్ ధర్మవరం అంటూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వచ్చారు కేతిరెడ్డి. సత్యకుమార్ తాజాగా ప్రచారం ప్రారంభించారు. మరి ఇద్దరి మధ్య పోటీ ెలా ఉంటుంది. ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారనే ఉత్కంఠ నెలకొంది. 


ధర్మవరంలోకి సత్య ఎంట్రీ


బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తొలిసారి ఇవాళ ధర్మవరం నియోజకవర్గంలోకి గ్రాండ్ ఏంట్రీ ఇచ్చారు. ఆలస్యంగా ప్రచారం ప్రారంభించినప్పటికీ సత్యకుమార్ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై తీవ్రస్థాయిలో హైఓల్టేజ్‌ విమర్శలు చేస్తున్నారు. ఆయనకు పరిటాల శ్రీరామ్‌ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. 



గ్రాండ్ వెల్క్‌మ్ చెప్పిన నేతలు


సత్యకుమార్ ధర్మవరం వస్తున్న సందర్భంగా పరిటాల శ్రీరామ్(Paritala Sriram ) ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వందల వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా సరిహద్దు అయిన బత్తలపల్లి మండలం యర్రాయపల్లి గ్రామం వద్ద సత్యకుమార్‌కు పరిటాల శ్రీరామ్‌తో పాటు టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేన(Janasena) నాయకులు ఘన స్వాగతం పలికారన్నారు. 


సత్యకుమార్ గెలుస్తారని ధీమా 


ధర్మవరం ముఖద్వార వద్ద భారీ గజమాలను సత్యకుమార్‌కు వేసి ఆహ్వానించారు. దారి పొడువునా పూల వర్షం కురిపించిన అభిమానులకు సత్యకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారంలో భాగంగా ముందు పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సత్యకుమార్‌కు బాగా తెలుసన్నారు. అన్ని అంశాలపై అవగాహన చేసుకున్న తర్వాతనే నియోజకవర్గానికి వచ్చారన్నారు. ఇక్కడ చేనేతలు, రైతులు, కూలీలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం దొరకాలంటే.. సత్యకుమార్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నారు. 



ఇప్పటికే ఢిల్లీలో ధర్మవరం పేరు వినిపించిందని.. సత్యకుమార్ గెలుపు తర్వాత హస్తినలో ఈ పేరు నిత్యం వినిపిస్తూనే ఉండాలన్నారు శ్రీరామ్. చేనేతల ఇబ్బందుల పరిష్కారం కోసం సత్యకుమార్ కచ్చితంగా చొరవ చూపుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళలకు ఉపాధి అవకాశాల కోసం స్టిచ్చింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తారన్నారు. ముస్లింల కబరస్తాన్, హిందువుల స్మశాన వాటికల సమస్యలు ఉన్నాయన్నారు. 



ముస్లింలకు భరోసా


బీజేపీ అభ్యర్థి కాబట్టి ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇక్కడ వారి భద్రతకు, రక్షణకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు శ్రీరామ్. ఎమ్మెల్యే ఇన్ని రోజులు చేసిన అరాచకాలకు ఇక తెర పడే సమయం ఆసన్నమైందన్నారు. ఆయన అవినీతి కోటలు రెండు నెలల తర్వాత కూలుతాయన్నారు. ఇక్కడ వ్యాపారంలోకి రాజకీయాలు తీసుకొచ్చి హింసించే వైఖరి ఇక ఉండబోదన్నారు. సత్యకుమార్‌ని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి టీడీపీ కార్యకర్త తీసుకోవాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు.