Rajya Sabha elections: దేశంలో సాధారణ ఎన్నికల(General Elections 2024)కు సుమారు 40 రోజుల ముందు రాజ్యసభ(Rajyasabha) ఎన్నికలు జరిగాయి. ఏకంగా 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈ నెలలో విడుదల కావడం తెలిసిందే. ఇక, పోలింగ్ తేదీ 27(మంగళవారం) ప్రకటించడం కూడా విదితమే. అయితే.. షెడ్యూల్ విడుదల కాగానే.. ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లోని మూడు, తెలంగాణ(Telangana)లోని మూడు స్థానాలు సహా.. పలు రాష్ట్రాల్లో మొత్తంగా 41 స్థానాలకు ఆయా పార్టీలు ఏకగ్రీవంగా తమ అభ్యర్థులను ఎన్నుకుని... పెద్దల సభకు ప్రమోట్ చేసుకున్నాయి. ఇలా.. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మంచిదా? కాదా? అనే చర్చ కూడా సాగింది.
ఇదిలా వుంటే, మిగిలిన 15 స్థానాలకు తాజాగా మంగళవారం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కానీ.. ఇది ఫక్తు.. ఒత్తిళ్లు, స్వలాభాలు, బుజ్జగింపులతో నిండిపోవడంతో పెద్దల సభ ఎన్నికలపై పెద్ద మచ్చే వేసేసింది. తాజాగా రాజ్యసభకు ఏకగ్రీవాలు కాని మూడు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. వీటిలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉంది. ఇక్కడ 10 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా దక్షిణాదిలోని కర్ణాటకలో నాలుగు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఒకే ఒక రాజ్య సభ సీటు కూడా పోలింగ్ జరిగింది.
యూపీలో ఏం జరిగింది?
బీజేపీ(BJP) అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ అత్యధికంగా 10 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. అయితే.. పోరు హోరాహోరీగానే ఉంటుందని అంచనా వేసినట్టే అలానే జరిగింది. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీజేపీ కి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేయడంతో ఇక్కడ అంచనా తప్పిపోయింది. దీంతో బీజేపీకి ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా దక్కాల్సిన స్థానాలకంటే.. కూడా ఒకటి ఎక్కువగా కలిసివచ్చింది. ఇక్కడి మొత్తం 10 స్థానాల్లో బీజేపీ ఎనిమిది(8) స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ మూడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ.. బీజేపీ ప్రలోభాలు పెట్టిందనే వాదన వినిపించింది. దీనికి తగ్గట్టుగానే.. ఇక్కడ ఎస్పీ కేవలం రెండు స్థానాల విజయంతో సరిపెట్టుకుంది. ఇక, కాంగ్రెస్ పార్టీ మరో స్థానం దక్కించుకుంది. మొత్తంగా బీజేపీదే పైచేయిగా సాగింది. తమ బలానికి మించి బీజేపీ మరోఅభ్యర్థిని నిలబెట్టడం గమనార్హం. అంతేకాదు.. క్రాస్ ఓటింగును ప్రోత్సహించడం ద్వారా తన బలానికి మించి మరో స్థానాన్ని కమల నాథులు రాబట్టారు.
కర్ణాటకలో పరిస్థితి ఇదీ..
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని ఊహించని సీట్లను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ(Congress party) కర్ణాటక(Karnataka)లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహానికి అడ్డుకట్ట వేయలేక పోయింది. దీంతో బీజేపీ ఒక సీటును ఇక్కడ కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలను దక్కించుకోగా, నాలుగో స్థానం కోసం బరిలోకి దిగిన బీజేపీ-జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థి ఓటమిపాలయ్యారు. మొత్తంగా చూస్తే.. నాలుగు స్థానాలు దక్కించుకునే అవకాశాన్ని ఇక్కడ కాంగ్రెస్ వదులుకున్నట్టు అయింది.
హిమాచల్ లో..
ఉత్తరాదికి-ఈశాన్యానికి అటు ఇటు ఉండే హిమాచల్ ప్రదేశ్‌లో ఒకే ఒక్క రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరిగినా.. తీవ్ర ఉత్కంఠ మాత్రం కొనసాగింది. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది. అయినప్పటికీ.. రాజ్యసభ ఎన్నికలపై పట్టు కోల్పోయిందనే వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ బలాబలాలను చూస్తే.. కాంగ్రెస్‌కు 45 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. దీంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగి ఉంటే.. ఫలితం అనుకూలంగా వచ్చేది. కానీ, ముందు నుంచి అతిధీమా వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ కు, ఆయనకు సమానంగా చెరో 34 ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయగా విజయం మహాజన్ ను వరించింది. కాంగ్రెస్ ఎమ్మెల్మేలు ముగ్గురు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో తన సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు నిలుపుకోలేక పోయింది.