Rajaram village People boycott  Elections : గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడం లేదని రాజారాం గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్ళుగా ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నప్పటికీ రోడ్డు సౌకర్యం కల్పించడం లేదని ప్రతిసారి ఎన్నికల సమయంలో నేతలు హామీలు ఇచ్చి ఆపై మర్చిపోతున్నారని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఓటు వేయకూడదని గ్రామంలో వారంతా  నిర్ణయానికి వచ్చారు. 




మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో ఉందీ రాజారాం గ్రామం. కొత్తపల్లి, రాజారాం రెండు గ్రామాలు కలిపి రాజారాం పంచాయితీ ఏర్పడింది. ఈ రాజారాం, కొత్తపల్లి గ్రామానికి గత కొన్నేళ్లుగా రోడ్డు సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. 




రోడ్డు లేకపోవడంతో బడికి వెళ్ళే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సిన 108 అంబులెన్స్ కూాడ వచ్చే వీళ్లేకుండా పోతోందని వాపోతున్నారు. ఎన్నోసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ ప్రాంతం వైల్డ్‌ లైఫ్‌ పరిధిలో ఉన్నందున మౌలిక సదుపాయల కల్పనను ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెన్నూర్ నియోజకవర్గంలో ఉన్న ఈ పల్లెను ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు సందర్శించారు. రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. అలాంటి వాళ్లు మంత్రి పదవులు కూడా అనుభవించారు కానీ సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేకపోయారు. 




పారిపల్లి - వెంచపల్లి మీదుగా కొత్తపల్లి, రాజారాం గ్రామం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజారాం గ్రామానికి రావాలంటే అక్కడ నుంచి గుంతలమయమైన మట్టి రోడ్డు ఉంది. వర్షాకాలంలో రోడ్డంతా పాడైపోతుంది. రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంటుంది. యేటా వర్షాకాలంలో ఆ రోడ్డుపైనే ప్రయాణాలు చేసి అవస్థలు పడుతున్నారు. బబ్బేర చెలక గ్రామ సమీపంలో ఉన్న వాగు ఉప్పొంగితే అంతే సంగతులు. ఈ వాగు ఉప్పొంగి విద్యార్థులు ఇరుక్కుపోయిన ఘటనలు కూడా గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఉపాధ్యాయులు కూడా వాగు దాటి వచ్చి పాఠాలు చెప్పే పరిస్థితి లేకపోయింది 




అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలను సైతం ఆసుపత్రికి తరలించాలన్న 108 వాహనం రాలేక ఇప్పటి వరకు ఒకరిద్దరూ మృత్యువాత పడ్డారు. రాజారం గ్రామంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకునేందుకు పాఠశాల ఉంది. ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకునే విద్యార్థులంతా బబ్బెరచెల్క గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న పాఠశాలలో చదువుకుంటారు. 




రాజారాం నుంచి బబ్బెర చెల్కా గ్రామం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామానికి ఆనుకొని జగ్దల్‌పూర్- నిజామాబాద్ హైవే ఉంది. జగదల్పూర్ హైవే నుంచి బబ్బెరచెల్క మీదుగా రాజారం గ్రామం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ 2 కిలమీటర్ల దూరం రోడ్డు వేస్తే సరిపోతుంది. అటు పారిపేల్లి నుంచి కొత్తపల్లి మీదుగా రాజారాం గ్రామం 6 కిలోమీటర్ల దూరం ఉంది. అలా అయితే 6 కిలోమీటర్ల దూరం రోడ్డు వేయాల్సి వస్తోంది. కానీ వీటన్నిటికీ వైల్డ్ లైఫ్ పరిధిలో ఉన్నందున ఫారెస్ట్ క్లియరెన్స్ రాకపోవడంతో రోడ్డు పనులు నిలిచిపోతున్నాయి. తెలుగుదేశం హయాంలో బోడ జనార్ధన్ కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా వినోద్ పని చేశారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వివేక్, ఎమ్మేల్యేగా నల్లాల ఓదెలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక చెన్నూర్ ఎమ్మేల్యే, ప్రభుత్వ విప్‌గా నల్లాల ఓదెలు, బాల్క సుమన్ ఎంపిగా, ఆపై ఎమ్మేల్యే.. ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 




పైన చెప్పిన వారందరికీ గ్రామ సమస్యలు విన్నవించిన పరిష్కరించలేకపోయారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. చెన్నూర్ ఎమ్మేల్యేగా గడ్డం వివేక్ గెలుపొందారు. ఆయన సైతం రాజారం కొత్తపల్లి గ్రామాలను సందర్శించి ఎన్నికల సమయంలో గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గెలుపొందాక తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారని, ఇప్పటికీ అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని గ్రామస్తులు వాపోతున్నారు. 




అనేక సమస్యలతో సతమతమవుతున్న గ్రామంలో పెద్దలంతా చర్చించుకొని ఈసారి ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఎవరు న్యాయం చేయడం లేదు..? రోడ్డు సౌకర్యం లేదు..? ఎందుకు ఇలాంటి దుస్థితి నెలకొందని ప్రశ్నిస్తున్నారు? అందుకే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు వేయకూడదని తీర్మానించుకున్నామని ప్రజలు ఏబీపీ దేశంతో చెప్పారు. హామీలతో విసికిపోయామని ఇకపై సమస్య పరిష్కారం అయ్యే వరకు ఓటు అనే ఊసే ఎత్తబోమంటున్నారు.