పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీని అరెస్ట్ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాల కేసులో మనీలాండరింగ్ ఆరోపరణలపై భూపేందర్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది.
ప్రశ్నించి..
ఈ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ.. భూపేందర్‌ను తమ కార్యాలయానికి గురువారం పిలిచింది. కొన్ని గంటలు ప్రశ్నించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసింది. జలంధర్ కోర్టులో ఈరోజు భూపేందర్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
జనవరి 23నే భూపేందర్‌ను ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఆరోగ్య కారణాలు చెప్పి భూపేందర్ హాజరకుకాలేదు. నిన్న హాజరుకాగా ఈడీ అరెస్ట్ చేసింది.
ఈడీ దాడులు..
చన్నీ మేనల్లుడు అయిన భూపిందర్ సింగ్ హనీ.. పంజాబ్ రియల్టర్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల రూపాయల నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడం వల్ల ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. ఆయనకు చెందిన పలు ఇళ్లపై జనవరి 18న ఈడీ దాడులు జరిపింది ఈడీ. రూ.6 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
కీలక సమయంలో..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం మేనల్లుడు అరెస్ట్ కావడం చన్నీని, కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేలా చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే భాజపా, ఆమ్‌ఆద్మీ ఈ కేసులో చన్నీకి కూడా భాగముందని ఆరోపణలు చేస్తున్నాయి.
కెప్టెన్ అమరీందర్ సింగ్.. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత చన్నీ ఆ బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలలుగా ఆయన సీఎం పదవిలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పేరును ఈ నెల 6న పార్టీ అధిష్ఠానం ప్రకటించనుంది. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ, చన్నీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి సమయంలో చన్నీకి ఇది ప్రతికూలాంశంగా మారే అవకాశం ఉంది.