Pulsus Ceo Gedela Srinubabu: ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, పల్సస్‌ సంస్థ అధినేత గేదెల శ్రీనుబాబు రాజకీయ పయనంపై ఆసక్తి నెలకొంది. గడిచిన ఏడాది కాలం నుంచి ఆయన విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. రైతు సదస్సులు, మహిళలతో మమేకం కావడం, తాజాగా యువ శక్తి పేరుతో యువ సదస్సును శుక్రవారం విశాఖ నగరంలో నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ముందు శ్రీనుబాబు ఈ కార్యకలాపాలను చేపడుతుండడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి శ్రీనుబాబు రానున్నారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి సీటు ఆశిస్తుండడం వల్లే ఈ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ శ్రీనుబాబు ఎక్కడా రాజకీయ అంశాలను ప్రస్తావించడం లేదు. ఉత్తరాంధ్ర ప్రజలు, రైతులు, మహిళలు ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను విస్తతృతం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు ఆయన చెబుతూ వస్తున్నారు. 


జనసేన నుంచి పోటీకి సిద్ధపడి.. వైసీపీలో చేరి


గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు శ్రీనుబాబు జనసేన పార్టీలో చేరారు. విశాఖ పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలో దిగేందుకు సిద్ధపడ్డారు. మరో రెండు, మూడు రోజుల్లో ప్రకటన వెలువడుతుందన్న తరుణంలో సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఇది ఆ పార్టీ ముఖ్య నాయకులకు షాక్‌ ఇచ్చినట్టు అయింది. ఇప్పటికీ శ్రీనుబాబు వైఎస్‌ఆర్‌సీపీలోనే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అయింది. ఇప్పటి వరకు పార్టీ నుంచి ఆయనకు కనీసం స్థాయిలో గౌరవం కూడా దక్కలేదన్నది ఆయన అనుచరులు చేస్తున్న విమర్శ. దీంతో పార్టీలో ఉండడం కంటే బయటకు రావడం మేలన్న భావనలో ఆయనతోపాటు సన్నిహితులు ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే గడిచిన ఏడాదిన్నర కాలం నుంచి అనేక కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తూ వస్తున్నా.. సొంత బ్రాండ్‌, తన ఫొటోతోనే చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలు నుంచి మంచి ఆఫర్‌ వస్తే చేరేందుకు సిద్ధపడుతున్నారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, ప్రధాన పార్టీల నుంచి ఆయనకు పిలుపు వచ్చినట్టు లేదని చెబుతున్నారు. 


ఆర్థికంగా స్థితిమంతుడు


పల్సస్‌ సంస్థ అధినేతగా ఉత్తరాంధ్రలో చాలా మందికి సుపరిచితుడు శ్రీనుబాబు. కాపు సామాజికవర్గానికి చెందిన శ్రీనుబాబు ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కల్పించారు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు మరింత సేవ చేయాలని భావిస్తున్నారు. ఇందుకు తన స్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. ప్రధాన పార్టీల్లో అవకాశాలు కోసం చూస్తున్న శ్రీనుబాబుకు.. ఒకవేళ అటువంటి అవకాశం రాకపోతే ఏం చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. గడిచిన ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి, పార్టీలోనే ఉండి ఉంటే బాగుండేదని, కానీ, వైసీపీలో చేరి తప్పు చేశారని పలువురు చెబుతున్నారు. ఇప్పుడు ఎటు కాకుండా ఆయన రాజకీయం అయిపోయిందన్న భావన చాలా మందిలో ఉంది. మరి చూడాలి ఆయన ఏ పార్టీ వచ్చే ఎన్నికలు నాటికి అడుగులు వేస్తారో.