Eletions 2024 :  ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ తర్వాత మోడీ మళ్లీ ఈ నెల 6, 8 తేదీల్లో రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు.  రోడ్ షోలు, బహిరంగ సభల్లో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‎తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది.  మే 6న మధ్యాహ్నం మూడు గంటలకు ముందుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్నారు ప్రధాని మోదీ. అక్కడినుండి చంద్రబాబు, పవన్‎లతో కలిసి వేమగిరి సభా ప్రాంగణానికి వెళ్లనున్నారు. రాజమండ్రి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థుల  కోసం ప్రచారం చేయనున్నారు.                                             

  


రాజమండ్రిలో సభ తర్వాత సాయంత్రం 5.45 గంటల విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం అనకాపల్లిలో  రోడ్ షో నిర్వహించనున్నారు. అనకాపల్లిలో కూడా  చంద్రబాబు, పవన్ పాల్గొంటారు. ఏడో తేదీన ఇతర రాష్ట్రాల్లో మోదీ పర్యటించున్నారు.  మే 8న మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోడీ పీలేరు అసెంబ్లీ పరిధిలో కలికిరి వద్ద ఏర్పాటుచేసి బహిరంగ సభలో పాల్గొంటారు.  తర్వాత  5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకుని బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ మూడు సభలు, రోడ్ షోలలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేయనున్నారు.                                             


మోదీ పర్యటనలో ఎలాంటి లోపాలు లేకండా  అన్ని భద్రతాపరమైన చర్యలను  పోలీసులు చేపట్టారు. బీజేపీ పోటీ చేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోనే ప్రధానంగా ప్రచారం చేయనున్నారు. అయితే ఆయన ఎక్కడ ప్రచారం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉంటుందని పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మొదటి సారిగా చిలుకలూరిపేట బహిరంగసభకు  మోదీ హాజరయ్యారు. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా ఏపీలో నాలుగోవిడత పోలింగ్ జరుగుతూంటంతో.. మొదటి మూడు విడతలల్లో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.                   


నాలుగో విడతలో తెలంగాణలోనూ ఎన్నికలు జరుగుతూండటంతో మోదీ తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. రెండు రోజులకిందట మోదీ జహీరాబాద్ బహిరంగసభలో ప్రకటించారు. పదోతేదీన మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. పదకొండో తేదీన నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ. ఆ లోపు రెండు సభల్లో ప్రసంగించే అవకాశం ఉంది. బీజేపీ అగ్రనేతలు కూడా ప్రచారానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.