Attempted murder has been registered against Machilipatnam YCP candidate Kittu : మచిలీపట్నం వైసిపి అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి పై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. ఆయనను కిట్టు అని పిలుస్తారు. పేర్ని కిట్టుతో పాటు మొత్తం ఆరుగురిపై కేసు నమోదయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు… ఈ కేసులో మొత్తం ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఎ1 గా పేర్ని కిట్టుని పోలీసులు పేర్కొన్నారు.చిలకలపూడి గాంధి, చిలంకుర్తి వినయ్, శీనయ్య, ధనబాబు, లంకే రమేష్‌లపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కిట్టు మినహా మిగిలిన ఐదుగురిని కోర్టులో హాజరుపరిచారు.
అదే సమయంలో జనసేన నేత కర్రి మహేష్ మరో ముగ్గురు పై ఎస్ సి, ఎస్టీ కేసులను పోలీసులు నమోదు చేశారు. . కర్రి మహేష్‌తో పాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కులం పేరుతో దూషించారని వైసీపీకి చెందిన దళిత మహిళ డి.నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గురువారం మచిలీపట్నంలోని విశ్వ బ్రాహ్మణ కాలనీలో వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన నేత కర్రి మహేష్ ఇంటి ముందు పేర్ని కిట్టు అనుచరులు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కారు అద్దాలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. మహేష్ భార్య హేమలతపై దాడి చేసి ఆమె మెడలోని తాళిబొట్టును లాగేశారు. అడ్డుకున్న ఆమె అత్తగారు జ్ఞానప్రసూనాంబను నెట్టేయడంతో ఆమె తలకు గాయమైంది. హేమలతపై పైశాచికంగా పేర్ని కిట్టు అనుచరులు వ్యవహరించారు. అక్కడే ఉన్న హేమలత కుమారుడు సాయికృష్ణ రామబ్రహ్మం, కుటుంబసభ్యులు గోకుల్, నాగబాబులపైనా చేయి చేసుకున్నారు.
ఇది జరుగుతున్న సమయంలోనే అక్కడికి మహేశ్ చేరుకున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించగా అతడి పైనా దాడి చేశారు. తమను రక్షించాలంటూ బాధితులు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదు. ప్రచార వాహనంలోనే కూర్చున్న పేర్ని కిట్టు తన అనుచరులను ప్రోత్సహించారు. వారంతా అక్కడి నుంచి వెళ్లిన తర్వాత బాధితులు పక్కనే ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఎస్పీ ఆఫీసును ముట్టడిస్తామని టీడీపీ, జనసేన నేతలు ప్రకటించారు. ఆలస్యంగా కేసు పెట్టిన పోలీసులు పేర్ని కిట్టును మినహా మిగిలిన వారిని అరెస్టు చేశారు.
బందరు తాలుకా పోలీస్ స్టేషన్ పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నాని, అతని కుమారుడు కిట్టుపై కేసు నమోదు చేయాలని మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. బందరు మండలం ఆర్ గొల్లపాలెంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందలాది వైసీపీ శ్రేణులతో తాలుకా పీఎస్ వద్ద అలజడి సృష్టించిన తండ్రీ, కొడుకులపై కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొద్ది రోజుల కిందట బందరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా పేర్ని నాని, పేర్ని కిట్టు హడావుడి చేశారు. పేర్ని నాని ఎస్‌ఐ చాణిక్యతో దురుసుగా ప్రవర్తించారు. నానితో పాటు ఆయన కుమారుడు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టారు.