Elections 2024 : ఏపీలో పెన్షన్ దారులు పడుతున్న ఇబ్బందులపై   టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి  లేఖ రాసారు. పెన్షన్ దారుల ఇబ్బందుల గురించి లేఖలో ప్రస్తావించారు. పెన్షన్ కోసం లబ్ధిదారులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తుండటంతో దీనిపై చంద్రబాబు స్పందించారు.పేదల ప్రాణాలతో రాజకీయం చేయడం ఏంటని సీఎస్ ను ప్రశ్నించారు.  ఎన్నికలకు ముందు పెన్షన్ దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.  ఈ నెల కూడా పెన్షన్ దారులను ఎండలో తిరిగేలా చేసి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. పెన్షన్ డబ్బలు బ్యాంకుల్లో జమ చేయడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మండు టెండల్లో లబ్ధిదారులు రోడ్లపై తిరగాల్సి వస్తుందని తెలిపారు. గత నెలలో  ఎండలో సచివాలయాల చుట్టూ తిప్పారని.. ఇప్పడు మళ్లీ బ్యాంకుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారని లేఖలో  ఆరోపించారు. 


పెన్షనర్లను ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు దారుణం 
ప్రభుత్వ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, పింఛన్ దారులకు ఇబ్బందులు కలిగేలా నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు.  మండుటెండల్లో పెన్షన్ దారులను బ్యాంకులు చుట్టూ తిప్పుతూ నరకయాతన చూపిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పేదల ప్రాణాలతో రాజకీయం చేయొద్దని సూచించారు. పింఛన్ పేరుతో మారణ హోమాన్ని సృష్టిస్తున్నారని, ఏ1గా జగన్, ఏ2గా సీఎస్ అని చంద్రబాబు ఆరోపించారు. వెంటనే పింఛన్‌దారులకు ఇంటి వద్దనే నగదు పంపిణీ చేయాలని చంద్రబాబు లేఖలో డిమాండ్ చేశారు.             


ఈసారి నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు జమ 
గత నెలలో సచివాలయాల వద్ద పెన్షన్ల కోసం లబ్ధిదారులు క్యూ కట్టడంతో ఈసారి నేరుగా బ్యాంకులో నగదు జమ చేశారు. అయితే, ఎలా చేసినా ఇబ్బందులు.. క్యూలో నిలబడడం తప్పలేదని పెన్షన్ దారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకులకు పోటెత్తడంతో రద్దీ నెలకొంది. ఈ క్రమంలో నగదు పంపిణీ బ్యాంకర్లకు సవాల్ గా మారగా.. క్యూలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని పెన్షన్ దారులు వాపోయారు. బ్యాంక్ సర్వీసుల గురించి అవగాహన లేని వృద్ధుల ఇబ్బందులు వర్ణణాతీతం.                 


ఏ అకౌంట్లో జమ చేశారోనని కన్ఫూజన్ 
అలాగే, ఎక్కువ బ్యాంక్ ఖాతాలున్న వారు ఎందులో నగదు పడిందో తెలియక తలలు పట్టుకున్నారు. కొందరు అకౌంట్లు ఎక్కువ రోజులుగా వాడకంలో లేకపోవడంతో అవి డీయాక్టివేట్ అయ్యాయి. ఈ క్రమంలో వాటిని యాక్టివేట్ చేసుకోవాలని బ్యాంక్ అధికారులు సూచించగా.. దాని కోసం ఇబ్బందులు పడ్డారు. అసలే ఎండ తీవ్రతతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని చాలా మంది వాపోయారు. కొందరికి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేకపోవడంతో.. కేవైసీ ఇబ్బందులు తలెత్తాయి. అయితే, పెన్షన్ దారులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసినట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.