Karnataka Elections :   కర్ణాటక ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ పేరుతో జరిగే డబ్బు, మద్యం పంపిణీలను అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం  సరిహద్దు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.  కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల సరిహద్దు రాష్ట్రాల సీఎస్‌, డీజీపీలతో  వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి  స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల  ర పోలీసు యంత్రాంగం  సరిహద్దు జిల్లాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది.  డబ్బు, మద్యం అక్రమ రవాణా జగరకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.    


ఏపీ సరిహద్దు జిల్లాలలపై ఎక్కువ దృష్టి !                                


ఏపీలో  కర్నాటకకు ఆనుకుని చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లా, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల జిల్లాలు ఉన్నాయి.  రిహద్దు జిల్లాల్లో పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచీ ఎన్నికల నిబంధనలు పూర్తి స్ధాయిలో అమల్లోకి రానున్నాయి. సరిహద్దుకు 5 కిలోమీటర్ల పరిధిలో ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి. ఓటర్లను ప్రలోబపరిచేందుకు మద్యం, నగదు, ఇతర బహుమతులు, సామాగ్రిని సరిహద్దు మార్గాల ద్వారా కర్నాటకకు వెళ్ళకుండా నియంత్రించేందుకు తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కర్నాటకలో పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి మద్యం నిషేధం ఉంటుంది. దీంతో ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాగం మద్య నిషేధం అమలు చేయనుంది. 


తెలంగాణతో సరిహద్దు తక్కువే !                                        


కర్ణాటకతో ఏపీకే ఎక్కువ సరిహద్దు ఉంది. తెలంగాణలో జహీరాబాద్ వద్ద బీదర్ వంటి కర్ణాటక నియోజకవర్గాలు ఉన్నాయి. అందుకే అటు వైపు కూడా చెక్ పోస్టులు పెడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50కిపైగా  చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు తనిఖీలు, చెక్‌పోస్టుల ఏర్పాటుకు ఆస్కారం లేని చోట్ల నిరంతరం పెట్రోలింగ్‌ పార్టీలు సంచరిస్తున్నాయి. కర్నాటక నుంచి ఏపీ వైపు వచ్చే వాహనాలు, రాకపోకలపై ఎస్‌ఇబి దృష్టి పెట్టింది. ఏపీ నుంచి కర్నాటకలోకి ప్రవేశించే మార్గాల్లో రాకపోకలపై పోలీసు యంత్రాంగం తనిఖీల బాధ్యతను నిర్వహిస్తోంది.


దొంగ ఓటర్ల కట్టడికి ప్రణాళికలు                


ఎన్నికలు ఎక్కడ జరిగినా బస్సుల్లో బోగస్ ఓటర్లు వెళ్లడం ప్రతీ సారి వివాదాస్పదంఅవుతోంది. ఏపీ సరిహద్దు జిల్లాల నుంచి వలస వెళ్ళిన అనేక మందికి అక్కడ, ఇక్కడ రెండు చోట్ల గుర్తింపు కార్డులు ఉన్నట్లుగా భావిస్తున్నారు.  పోలింగ్‌ రోజున అల్లర్లు సృష్టించేందుకు, దొంగ ఓట్లు షురూ చేసేందుకు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం సరిహద్దులో తల దాచుకునే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. ఇలాంటి వారిని కట్టడి చేయనున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ప్రధానంగా యంత్రాంగం సరిహద్దులో నగదు, మద్యం రవాణాపైనే దృష్టి పెట్టింది.