AP Elections 2024: పొత్తుల్లో భాగంగా టీడీపీ(TDP) 144 సీట్లలో జనసేన(Janasena) 21 సీట్లలో బీజేపీ(BJP) 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అప్పటి వరకు అక్కడ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న నేతలకు సీటుపోటు తప్పలేదు. మరికొందరికి ప్రజాబలం లేనట్టు సర్వేల్లో వచ్చిందని పార్టీ అధినాయకత్వం వేరే లీడర్‌కు సీటు ఇచ్చింది. సీటు తమకే వస్తుందని ఆశలు పెట్టుకున్న లీడర్లు ఇప్పుడు ఉగ్రరూపం చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఈ పరిస్థితి వైసీపీలో కనిపించేది... అక్కడ కాకా చల్లారింది. ఇప్పుడు ఈ ఫైర్‌ కూటమి పార్టీల్లో కనిపిస్తోంది. 


ఆగ్రహ జ్వాల


కేసులు ఎదురొడ్డి అధికా పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా  కష్టపడి పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తే పోటీకి అన్ని సర్దుకున్న టైంలో వేరే వ్యక్తి వచ్చి టికెట్‌ కొట్టేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నేతలు. ఇది నమ్మద్రోహమని ఆరోపిస్తున్నారు. సైలెంట్‌గా ఉండిపోతే వీక్ అయిపోతామని గ్రహించి ఆందోళనకు పూనుకుంటున్నారు. 


పిఠాపురంలో ఫైర్


ఇలా అసంతృప్తితో రగిలిపోతున్న నియోజకవర్గాల్లో మొదటిది పిఠాపురం(Pithapuram). ఇక్కడ పొత్తుల్లో భాగంగా ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు సీటు తనకే వస్తుందని టీడీపీ లీడర్‌ ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ(SVSN Varma) పని చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల్లోనే ఉంటూ పార్టీని బలోపేతం చేశారు. మారిన రాజకీయ సమీకరణాలతో ఆ స్థానం పవన్ పోటీ చేస్తున్నారు. 


ముందే చెప్పిన ఏబీపీ దేశం


పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం నడుస్తోందని ముందు నుంచే ఏబీపీ దేశం(ABP Desam) చెబుతూ వస్తోంది. మొదట్లో పవన్ పోటీ చేస్తే తాను దగ్గరుండి గెలిపిస్తానంటూ చెప్పుకొచ్చిన వర్మ చివర్లో ప్లేట్‌ ఫిరాయించారు. తనకే సీటు ఇవ్వాలని తనకి కాకుండా ఎవరు పోటీ చేసినా ఊరుకునేది లేదన్నారు. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానంటూ ప్రతినబూనారు. 


వర్మ లోకల్‌ వాయిస్


ఈ మధ్య లోకల్‌ ఫ్లేవర్‌ని కూడా తీసుకొచ్చారు వర్మ. లోకల్‌గా ఉన్న వ్యక్తే ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తారని స్థానికుడికే టికెట్ ఇవ్వాలంటూ తన అనుచరులతో ఫ్లెక్సీలు పెట్టించాడు. ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెంచినా పిఠాపురం టికెట్‌ జనసేనకు ఇచ్చేశారు చంద్రబాబు. దీంతో వర్మ, ఆయన అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టీడీపీ ఫ్లెక్సీలు తగుల బెట్టారు. టీడీపీకి ,చంద్రబాబు(Chandra Babu)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


నేడు అనుచరులతో భేటీ


భవిష్యత్ కార్యచరణపై ఇవాళ వర్మ తన అనుచరులతో సమావేశం కానున్నారు. స్వతంత్రంగా పోటీ చేయడమా లేకుంటే వేరే ఆలోచన చేయడమా అనేది తేల్చనున్నారు. 2014లో కూడా ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. అప్పుడు కూడా  పీవీ విశ్వం అనే నేతలు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన వర్మ 47వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత టీడీపీలో చేరిపోయారు. 2019లో వర్మ టీడీప టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ జనసేన తరఫున పోటీ చేసిన శేషుకుమారి ఓట్లు చీల్చడంతో వర్మకు ఓటమి తప్పలేదు. 


జవహర్‌ అసంతృప్తి


మరో టీడీపీ లీడర్ జవహర్‌ కూడా ఫైర్‌ మీద ఉన్నారు. తూర్పుగోదావరి(East Godavari) జిల్లా కొవ్వూరు(Kovvur) టికెట్‌పై జవహర్‌(Jawahar) ఆశలు పెట్టుకున్నారు. అయితే సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారన్న కారణంతో అక్కడ టికెట్‌ను ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించారు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తాను కృషి చేశానని తనకే టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు. తనకు టికెట్‌ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానంటూ చెబుతున్నారు. ఇవాళ తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. 


పెనమలూరులో ప్రకంపనలు


ఇంకా ప్రకటించకపోయినా పెనమలూరు(Penamaluru) టికెట్‌ రగడ టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇక్కడ టీడీపీ చేసిన సర్వేల్లో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌(Bode Prasad)తోపాటు దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. దీంతో బోడే ప్రసాద్ వర్గీయులు స్థానికత కార్డును బయటకు తీశారు. పెనమలూరులో స్థానికేతరులు వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. బోడే ప్రసాద్ కూడా ఈ నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు. తాను ఐదేళ్లుగా ప్రజల్లో తిరుగుతూ పార్టీ బలోపేతానికి కష్టపడ్డానని చెబుతున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. అలాంటి తనకు టికెట్ ఇవ్వకుండా వేరే ఆలోచన చేయొద్దని అధినాయకత్వానికి హెచ్చరించారు. ఇప్పటికీ చంద్రబాబుపై తనకు నమ్మకం ఉందని తనకే టికెట్ ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తూనే హెచ్చరిక కూడా చేశారు. అనుచరులు ఎవరూ ఆవేశ పడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించార.