Elections 2024 :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల నియోజకవర్గంలోని 202 పోలింగ్ బూత్‌లోకి దౌర్జన్యంగా చొరబడిన ఆయన నేరుగా ఈవీఎం మెషిన్ వద్దకు వెళ్లి తీసుకుని పగులగొట్టారు. తర్వాత అక్కడున్న వారిని బెదిరించి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 



మాచర్ల నియోజకవర్గంలోని అన్ని  పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర స్థాయి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ రోజున సాయంత్రం ఆయనను గృహనిర్బంధంలో ఉంచారు. తర్వాత అల్లర్లపై పోలీసుల విచారణ ప్రారంభం కావడంతో ఆజ్ఞాతంలోకి వెళ్లారు. తాను ఎక్కడికి పోలేదని.. హైదరాబాద్ లో ఉన్నానని ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. 


ఈ క్రమమంలో ఈవీఎంలను ధ్వంసం చేసే దృశ్యాలు వెలుగులోకి  రావడం సంచలనంగా మారింది. ఒక పక్క ఈవీఎంల ధ్వంసం, మరో పక్క మారణహోమం చేసి, ఏమి తెలియనట్టు జగన్ రెడ్డి దేశం దాటి పోతే, ఈ పిల్ల సైకోలు రాష్ట్రం దాటి పారిపోయారని టీడీపీ మండిపడింది. 


 






 


ఈ ఘటనపై  మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి కూడా స్పందించారు.  బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్య యుతంగా జరుగుతున్న పోలింగ్ బూత్ లోకి చొరబడి అధికారుల ముందే అడ్డగోలుగా రౌడీమాదిరి EVM లు పగలకొడుతున్నావు అంటే నీ ఓటమి తాలూకా భయం నీ నరనరాన జీర్ణించుకుని భయపడుతున్నావు అని అర్థమైందని  విమర్శించారు.                                       


 





పిన్నెల్లి  ఈవీఎం పగులగొట్టే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే సిట్ నివేదికలో పిన్నెల్లి సోదరులు పెద్ద ఎత్తున ఘర్షణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం..  ఈవీఎంలను ధ్వంసం చేసిన వారికి ఐదేళ్ల వరకూ శిక్ష పడుతుంది.