కర్ణాటక సరిహద్దుల్లో ఉండే కొడంగల్‌ నియోజకవర్గం చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండటంతో రాజకీయం హాట్‌హాట్‌గా సాగింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఈసారి మాత్రం పట్టుకోల్పోలేదు. సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌ రెడ్డిపై భారీ విజయం నమోదు చేశారు. ఏకంగా 32వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 


ఈ నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉంటుంది. కొన్ని మండలాలు నారాయణపేట జిల్లాలో ఉంటే మరికొన్ని మండలాలు వికారాబాద్‌ జిల్లాలో ఉంటాయి. రేవంత్ రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.