Election Results 2023: 


మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీ..? 


మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్‌ ఫైట్ తప్పదు (Madhya Pradesh Election Result 2023) అనుకున్నప్పటికీ ప్రస్తుత ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే పూర్తిగా బీజేపీవైపే మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. రౌండ్ రౌండ్‌కి బీజేపీకి ఆధిక్యం పెరుగుతోంది. కాంగ్రెస్‌ వెనకబడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌కి గట్టిగానే దెబ్బ తీస్తుందని భావించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత వరకూ ఈ ప్రభావం కనిపిస్తుందని చెప్పాయి. కానీ...అదేమీ ఈ ఫలితాల ట్రెండ్‌ని ఇంపాక్ట్ చేయలేదు. 120కి పైగా సీట్‌లు కాంగ్రెస్‌కి వస్తాయని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్‌. కానీ...బీజేపీ లీడ్‌లో దూసుకుపోతోంది. మళ్లీ తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చాలా ధీమాగా చెబుతోంది బీజేపీ. తాము చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని స్పష్టం చేస్తోంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 116 మేజిక్ ఫిగర్‌ని చేరుకోవాలి. ఇప్పుడున్న ట్రెండ్ ఆధారంగా చూస్తే బీజేపీ ఇంత కన్నా ఎక్కువగానే లీడ్‌లో ఉంది. మధ్యప్రదేశ్ తరవాత ఆసక్తి రేపిన రాష్ట్రం రాజస్థాన్. ఇక్కడ మళ్లీ తామే (Rajasthan Assembly Election Results 2023) అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ధీమాగా చెబుతోంది. కానీ ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తుంటే ఇక్కడా బీజేపీయే లీడ్‌లో కనిపిస్తోంది. 200 నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో 199 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 100 సీట్ల మేజిక్ ఫిగర్ సాధించాలి. ఇప్పుడున్న సరళిని చూస్తే ఆ అవకాశం బీజేపీకి ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ వెనకబడుతూ వస్తోంది. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాకే ఇది తేలుతుందన్నది నిజమే అయినా...ట్రెండ్‌ మాత్రం బీజేపీకి పాజిటివ్‌గా ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలూ ఇవే అంచనా వేశాయి. 


ఛత్తీస్‌గఢ్‌లో ఇలా..


ఇక ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh Election Result 2023) విషయానికొస్తే...మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్‌కే వేవ్‌ కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలూ ఇవే అంచనా వేశాయి. మొత్తం 90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 46 సీట్లు సాధించాలి. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఇక్కడ టఫ్ ఫైట్‌ కనిపిస్తోంది. నాలుగైదు సీట్ల తేడాతో రెండు పార్టీలూ లీడ్‌లోనే ఉంటున్నాయి. రెండు పార్టీలనూ పోల్చుకుంటే కాంగ్రెస్ కాస్త ముందంజలో ఉంది. కాస్త అటు ఇటు అయినా మళ్లీ బీజేపీకి అవకాశాలు పెరగొచ్చు. కానీ...కాంగ్రెస్ మాత్రం కచ్చితంగా తామే గెలుస్తామని ధీమాగా చెబుతోంది.